గోదారి వరద కన్నా ప్రతిపక్షాల కన్నీటి వరదే ఎక్కువ

గోదారి వరద కన్నా ప్రతిపక్షాల కన్నీటి వరదే ఎక్కువ

హైదరాబాద్, వెలుగు:గోదావరి వరదల కంటే కాంగ్రెస్, బీజేపీ నేతల కన్నీటి వరద ఎక్కువగా ఉన్నదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు వచ్చిన వరదలు 500 ఏండ్లలోనే అత్యంత తీవ్రమైనవని ఓవైపు కేంద్ర జలసంఘం చెబుతుంటే.. అదేం పట్టించుకోకుండా విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ.95 వేల కోట్లు ఖర్చుచేస్తే రూ.2 లక్షల కోట్ల అవినీతి జరిగిందంటున్నారని మండిపడ్డారు. ‘‘ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును నిర్మించిన వైఎస్సార్  తమవాడని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అదే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. రీ డిజైన్ చేసి కాళేశ్వరం ఎత్తిపోతలను నిర్మిస్తే కాంగ్రెస్, బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నరు” అని విమర్శించారు. కేంద్ర జలవనరుల నిపుణులే కాళేశ్వరాన్ని ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్తుంటే ప్రతిపక్షాలు అక్కసు వెళ్లగక్కుతున్నాయని అన్నారు. ఎత్తిపోతల పథకాలకు, ప్రాజెక్టులకు తేడా తెలియకుండా మాట్లాడుతుండటం సిగ్గుచేటని విమర్శించారు. సాగునీటి విషయంలో తెలంగాణ గొంతు కోసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, నీటి లభ్యత లేని చోట ప్రాజెక్టులు ప్రతిపాదించి దశాబ్దాల పాటు నిర్మాణాలు సాగదీశారని విమర్శించారు. సీనియర్ ఇంజినీర్ పెంటారెడ్డి ప్రతిభను గుర్తించకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆల్మట్టి ఎత్తు పెంచడానికి కర్నాటక ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్ మీద మొరగడం మాని కేంద్రాన్ని నిలదీయాలని, పార్లమెంటులో మాట్లాడాలని నిరంజన్ రెడ్డి సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం కక్షపూరిత వైఖరి అవలంభిస్తున్నదని అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పౌరసరఫరాల శాఖ బాధ్యత నిర్వహించడంలో విఫలమయ్యాడని, తనకు వ్యవసాయం మీద అవగాహనలేదని తానే స్వయంగా చెప్పాడని తెలిపారు.

హైడెన్సిటీ విధానంలో పత్తి సాగు చేస్తం

రాష్ట్రంలో కోటి ఎకరాల వరకు పత్తిని సాగు చేయడమే కాకుండా, అవసరమైతే యాసంగి సీజన్ లోనూ వరి బదులు పత్తి వేసుకుంటే పత్తి ప్రధానమైన పంటగా నిలుస్తుందని నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని భూమిలో తేమ పెరిగిందని, ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చాయన్నారు. పత్తి పంట బాగా పెరిగేందుకు ఇవి సాయపడుతాయన్నారు. రెండో పంటగా సాగు చేసుకునేందుకు ఇబ్బంది ఉండదన్నారు. ముందుగా రెండో పంటను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని 1000 ఎకరాల్లో సర్కారు అనుమతి తీసుకొని సాగుచేయించి నిరూపిస్తామన్నారు. అలాగే ఈ సారి 20 వేల నుంచి 40 వేల ఎకరాల్లో హైడెన్సిటి విధానంలో పత్తి సాగుచేయిస్తున్నట్టు తెలిపారు. ఈ విధానంపై అమెరికా వెళ్లి స్టడీ చేశామన్నారు. 
*