- విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీస్కుంటం
హైదరాబాద్, వెలుగు: సీజనల్ వ్యాధుల నివారణకు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ రాజ్ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించాలని, క్షేత్ర స్థాయి సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. స్పెషల్ ఆఫీసర్లతో ఉన్నతాధికారులు కో ఆర్డినేట్ చేసుకోవాలన్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సెక్రటేరియెట్ నుంచి డీఆర్డీవోలు, డీపీవోలతో మంత్రి సీతక్క శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలు, గ్రామీణ ఉపాధిహామీ పనులు, వన మహోత్సవం అమలుపై అధికారులకు ఆమె పలు ఆదేశాలు జారీ చేశారు. ‘‘తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగ్యూ, మలేరియా వంటి రోగాలకు కారణమయ్యే దోమల నివారణకు చర్యలు చేపట్టాలి. జ్వరాలు వస్తే.. ఇంటింటి ఫీవర్ సర్వేలు నిర్వహించాలి. మలేరియా, డెంగ్యూ టెస్టింగ్ కిట్లు గ్రామాల్లో అందుబాటులో ఉంచాలి’’అని మంత్రి సూచించారు.
