జర్నలిస్టుల సమస్యలపై సీఎంతో చర్చిస్తా: మంత్రి శ్రీధర్ బాబు

జర్నలిస్టుల సమస్యలపై సీఎంతో చర్చిస్తా: మంత్రి శ్రీధర్ బాబు

షాద్ నగర్, వెలుగు: జర్నలిస్టుల సమస్యలపై సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి శ్రీనివాసరెడ్డితో చర్చిస్తానని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కందుకూరులో టీడబ్ల్యూజేఎఫ్ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సోమయ్య, బసవ పున్నయ్య, జిల్లా కార్యదర్శి సైదులు జర్నలిస్టులకు ప్లాట్లు, హెల్త్​, అక్రిడిటేషన్లు   ఇవ్వాలని కోరగా,   మంత్రి స్పందించారు.  ప్లాట్ల కేటాయింపు సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఆగిపోయిందని, ప్రత్యామ్నాయ మార్గం చూస్తున్నామని చెప్పారు. త్వరలో జర్నలిస్టులకు కూడా పురస్కారాలు ఇస్తామన్నారు.  

జర్నలిస్టులపై అందరూ కేసులు పెట్టేవాళ్లే.. 

అధికారంలో ఎవరున్నా.. అందరూ జర్నలిస్టులపై కేసులు పెట్టేవాళ్లేనని ఎమ్మెల్సీ నవీన్ కుమార్​రెడ్డి అన్నారు. ఒకరిద్దరు చేసే తప్పులను అందరికీ ఆపాదించవద్దని, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై సీఎం రేవంత్​రెడ్డితో మాట్లాడాలని, జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని మంత్రి శ్రీధర్​బాబుకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, సీపీఎం నాయకుడు పగడాల యాదయ్య తదితరులున్నారు.