కాలం చెల్లిన జ్ఞానాన్ని వదిలిపెట్టి కొత్త స్కిల్స్ నేర్చుకోండి : మంత్రి శ్రీధర్ బాబు

కాలం చెల్లిన జ్ఞానాన్ని వదిలిపెట్టి కొత్త స్కిల్స్ నేర్చుకోండి : మంత్రి శ్రీధర్ బాబు
  • ఎమర్జింగ్ టెక్నాలజీస్​పై పట్టు ఉంటేనే మంచి జాబ్స్
  • రాష్ట్ర యువతకు మంత్రి శ్రీధర్​ బాబు సూచన

హైదరాబాద్​, వెలుగు: మారుతున్న సమాజానికి తగ్గట్టు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలని, కాలం చెల్లిన జ్ఞానాన్ని వదిలి ‘లెర్న్, అన్‌లెర్న్, రీలెర్న్’ విధానంతో ముందుకు సాగితేనే విజయం సాధ్యమని రాష్ట్ర యువతకు ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.  మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) కార్యాలయంలో ‘మన అమెరికా తెలుగు సంఘం (మాట)’ ఆధ్వర్యంలో నిర్వహించిన  ఫ్రీ ఆన్‌లైన్ ఐటీ ట్రైనింగ్ సర్టిఫికెట్ల ప్రదానోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. " ఒకప్పటిలా చేతిలో డిగ్రీ ఉంటే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు.

 నాస్కామ్ నివేదిక ప్రకారం.. 50% గ్రాడ్యూయేట్లకు ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ లేవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీలపై అవగాహన అవసరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం.. 2025 నాటికి ఆటోమేషన్, ఏఐ వల్ల 8.5 కోట్ల ఉద్యోగాలు పోతే.. 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి. కానీ ఇందుకు క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, టీమ్ వర్క్, అడాప్టబిలిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి స్కిల్స్ చాలా కీలకం. స్మార్ట్ వర్క్‌తో కూడిన హార్డ్ వర్క్, వినూత్న ఆలోచనలు విజయానికి మార్గాలు. తెలంగాణను గ్లోబల్ స్కిల్ క్యాపిటల్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది" అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, సీవోవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, మాట ప్రతినిధులు శ్రీనివాస్, ప్రదీప్, విజయ్ భాస్కర్, నగేశ్, కళ్యాణి, డా. విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.