అసెంబ్లీలో కోరం లొల్లి

అసెంబ్లీలో కోరం లొల్లి
  •     కడియం శ్రీహరి వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ 

హైదరాబాద్, వెలుగు : సభ నడిచేందుకు అవసరమైన సభ్యుల కోరం ఉన్నా.. బీఆర్ఎస్​ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. సభ నడిచేందుకు మొత్తం సభ్యుల్లో10 శాతం సభ్యులు అంటే 12 మంది ఉంటే చాలని ఆయన స్పష్టం చేశారు. సభలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటే కోరం ఉన్నట్లో గతంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డికి తెలిసినా.. సభ నడవొద్దనే కోరం లేదని చెప్తున్నారని మండిపడ్డారు.

 బుధవారం అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత బడ్జెట్ పై చర్చను స్టార్ట్ చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సూచించారు. చర్చను స్టార్ట్ చేస్తూ కడియం అసెంబ్లీలో సభ్యులు తక్కువ మంది ఉన్నారని, బడ్జెట్ పై చర్చ అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు సభలో లేకపోవటం ఏమిటని ప్రశ్నించారు. దీంతో మంత్రి శ్రీధర్​బాబు స్పందిస్తూ.. సభలో సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నా

కోరం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చెప్పినా.. 10 మంది మంత్రులు మాట్లాడుతున్నారని, సంబంధిత మంత్రి మాట్లాడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని దానం నాగేందర్ అన్నారు. బడ్జెట్ మీద చర్చ స్టార్ట్ చేసి, త్వరగా పూర్తి చేయాలని, చాలా పెళ్లిళ్లు ఉన్నందున త్వరగా పూర్తి చేయాలని స్పీకర్​ను కోరారు. 

ప్రతిపక్షాలు సభలో ఉంటే బాగుండు

బడ్జెట్ పై చర్చ సందర్భంగా మధ్యాహ్నం సభలో ప్రతిపక్ష నేతలెవరూ లేకపోవడంతో మంత్రి శ్రీధర్ బాబు అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాలూ నాయక్ మాట్లాడుతున్న సందర్భంలో మైక్ తీసుకున్న శ్రీధర్ బాబు.. బడ్జెట్ పై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షాలు బయటకు  వెళ్లిపోయాయని అన్నారు. చర్చలో పాల్గొనకుండా బీఆర్ ఎస్ వాకౌట్ చేసిందని

బీజేపీ కూడా బయటకు వెళ్లిపోయిందని పేర్కొన్నారు. సభలో వాళ్లూ కూడా చర్చలో పాల్గొంటే బాగుండేదన్నారు. సభకు వారిని రావాల్సిందిగా కోరారు. అయితే, జోక్యం చేసుకున్న ప్యానెల్ స్పీకర్ రేపూరి ప్రకాశ్ రెడ్డి.. సభ్యులను సభకు రమ్మని రిక్వెస్ట్  చేయగలమే గానీ.. తీసుకురాలేమని అన్నారు.