ఆడ బిడ్డలకు చీర కాదు.. సారె పెడుతున్నం : మంత్రి శ్రీధర్ బాబు

ఆడ బిడ్డలకు చీర కాదు.. సారె పెడుతున్నం : మంత్రి శ్రీధర్ బాబు
  • మహిళలందరూ మా వెంటే ఉన్నరు: మంత్రి శ్రీధర్ బాబు
  • ఎవరెన్ని విమర్శలు చేసినా జూబ్లీహిల్స్‌‌‌‌లో  కాంగ్రెస్‌‌‌‌కే పట్టం కట్టిన్రు
  • రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌‌‌‌లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఆడ బిడ్డలకు చీర కాదు.. సారె పెడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం కొంగరకలాన్‌‌‌‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌‌‌‌లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీని ఆయన ప్రారంభించారు. అలాగే, జీవన్ జ్యోతి జిల్లా మహిళా సమాఖ్య సంఘానికి రూ.634.68 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారిని ఉన్నత స్థానంలో నిలుపుతామని చెప్పారు. 

మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం, పట్టాలు ఇవ్వడమనేది మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. అందుకే తమవెంట మహిళలు ఉన్నారని, జూబ్లీహిల్స్‌‌‌‌లో విజయం సాధించామన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌లో మళ్లీ కాంగ్రెస్‌‌‌‌కే పట్టం కట్టారని గుర్తుచేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి పథకాలు అందజేస్తామని వెల్లడించారు. 

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 108వ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని దాదాపు కోటి మంది మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నామని, మహిళా సంఘాల సభ్యులకు, అలాగే 18 ఏండ్లు నిండిన ఆడపడుచులందరికీ చీరలు అందజేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు, పట్టణాల్లో 35 లక్షల చీరల చొప్పున మొత్తం దాదాపు కోటి చీరలను పంపిణీ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. 

ప్రతి మహిళకు చీరలు అందేలా చూడండి..

గ్రామ, మండల సమాఖ్య బాధ్యులు చీరల పంపిణీ బాధ్యతను తీసుకొని ప్రతి మహిళకూ చీరలు అందేలా చూడాలని మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌ బాబు సూచించారు. మహిళలు ఐక్యంగా ఉండాలనే సందేశంతో చీరలు పంపిణీ చేపట్టినట్లు వెల్లడించారు. 

మహిళలకు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు, క్యాంటీన్లు, పెట్రోల్ బంకుల ఏర్పాటు, బస్సుల కొనుగోలు వంటి వ్యాపారంలో మహిళా సంఘాలకు ప్రభుత్వం తోడ్పాటునిస్తూ వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూస్తోందని చెప్పారు. 

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, టీయూఎఫ్ఐడీసీ చైర్మన్‌‌‌‌ చల్లా నర్సింహా రెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌‌‌‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, ఆర్ అండ్ బీ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, అధికారులు, జిల్లాకు చెందిన డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.