హైదరాబాద్​ను ఏఐ క్యాపిటల్​గా మారుస్తం: శ్రీధర్ బాబు

హైదరాబాద్​ను ఏఐ క్యాపిటల్​గా మారుస్తం: శ్రీధర్ బాబు
  • ఏఐ సిటీ కోసం 200 ఎకరాలు కేటాయించాం: శ్రీధర్ బాబు
  • సెప్టెంబర్​లో గ్లోబల్ ఏఐ సమిట్ నిర్వహిస్తున్నం
  • ప్రవాస భారతీయులందరూ రావాలి
  • అట్లాంటాలో నిర్వహించిన ఆటా బిజినెస్ సెమినార్​లో మంత్రి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ను ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాజధానిగా చేస్తామని ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నారు. ఆ లక్ష్యాన్ని అందుకునేలా ఏఐలో గణనీయమైన ప్రగతిని సాధించేందుకు ఏఐ సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటికే దీని కోసం 200 ఎకరాల భూమిని కూడా రాష్ట్ర సర్కారు కేటాయించిందని గుర్తు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్​లో హైదరాబాద్​లో జరగనున్న గ్లోబల్ ఏఐ సమిట్​కు అమెరికాలోని ప్రవాస భారతీయులు హాజరుకావాలని కోరారు. అట్లాంటాలో అమెరికన్ తెలుగు అసోసియేషన్​ (ఆటా) నిర్వహించిన బిజినెస్ సెమినార్​లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు. -హైదరాబాద్​లోని సెమీ అర్బన్​, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకూ పరిశ్రమలను తరలించేలా పారిశ్రామిక వికేంద్రీకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దానికి పారిశ్రామిక విధివిధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు. చిన్న, మధ్య తరహా కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. రూరల్ తెలంగాణ డెవలప్​మెంట్ స్టోరీస్​ను వ్యాపారవేత్తలు ఒకసారి పరిశీలించాలని, వారికి ప్రభుత్వం తరఫున సరైన మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఐటీలో స్థిరమైన అభివృద్ధి

రాష్ట్రంలో ఐటీ, పరిశ్రమలకు స్థిరమైన అభివృద్ధి సంస్కృతిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ‘‘ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం. పరిశ్రమల సాధికారత, వ్యవస్థాపకతను పెంపొందిస్తాం. ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరిచి సమృద్ధిగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తాం. పెద్ద కంపెనీలకే కాకుండా చిన్న, మధ్య తరహా కంపెనీలనూ ఆదరిస్తాం. వివిధ పారిశ్రామిక రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంకల్పించాం. సెమీ కండక్టర్లు, మెడికల్ పరికరాల సంస్థల కోసం సీవోఈ బిల్డింగులను ఏర్పాటు చేస్తున్నాం. సెమీ కండక్టర్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. సంస్థలను ఆకర్షించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం’’ 
అని ఆయన చెప్పారు.