2027 నాటికి కోటి మందికి ఏఐ ఆధారిత పౌర సేవలు: మంత్రి శ్రీధర్ బాబు 

2027 నాటికి కోటి మందికి ఏఐ ఆధారిత పౌర సేవలు: మంత్రి శ్రీధర్ బాబు 
  • తెలంగాణను 'గ్లోబల్ ఏఐ క్యాపిటల్'గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్​ బాబు 
  • 20 శాఖలకు చెందిన 250 మంది అధికారులకు ప్రత్యేక శిక్షణ

హైదరాబాద్, వెలుగు: 2027 నాటికి ఏఐ ఆధారిత పౌర సేవలను కోటి మందికి అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్‌‌స్టిట్యూట్‌‌లో సోమవారం ప్రారంభమైన 'ఏఐ - లెడ్ డిజిటల్ ట్రాన్స్‌‌ఫర్మేషన్ -చాంపియన్స్ అండ్​ కాటలిస్ట్స్ ప్రోగ్రామ్' కార్యక్రమంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ (ఐటీ శాఖ) ఆధ్వర్యంలో 20 శాఖలకు చెందిన 250 మంది అధికారులకు మూడు రోజుల పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం సమస్య వచ్చిన తర్వాత స్పందించేది కాదని.. ముందుగానే ఊహించి పరిష్కరించే చురుకైన, పారదర్శకమైన, దూరదృష్టి గల ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రజలు అడగకుండానే ఏఐ సహాయంతో వారి ముంగిటకు పౌర సేవలను చేర్చే సరికొత్త తెలంగాణను నిర్మించడమే తమ సంకల్పమని తెలిపారు. రాష్ట్రం 5 బిలియన్ డాలర్ల ఏఐ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా మారుతుందని, వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని ఆయన వివరించారు. 'ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్'గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.