
- ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీహరి
భద్రాద్రికొత్తగూడెం/చంద్రుగొండ, వెలుగు : పేదలకు ఇండ్లిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాత్రమేనని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిడి శ్రీహరి అన్నారు. జిల్లాలోని చంద్రుగొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల ప్రోగ్రామ్‌లో సీఎంతో కలిసి ఆయన బుధవారం పాల్గొన్నారు. అనంతరం దామరచర్లలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
వైఎస్సార్ హయాంలో అర్హత ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్లను, రేషన్ కార్డులను ఇచ్చారన్నారు. తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేర ప్రజలను మోసం చేశారని, రేవంత్రెడ్డి ఎన్నికల టైమ్‌లో ఇచ్చిన హామీలతో పాటు కొత్తగా ఎన్నో హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమంలో రాజీ పడడం లేదన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కుల గణన చేశామన్నారు.
జీవితంలో మర్చిపోలేని రోజు : ఎమ్మెల్యే జారే
తన నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలకు సీఎం శ్రీకారం చుట్టడం.. తన జీవితంలో మర్చిపోలేని రోజని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. నియోజకవర్గంలో ఐదు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్నామని చెప్పారు. అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాను పని చేస్తున్నానన్నారు.
పేదలందరికీ ఇండ్లు : ఎమ్మెల్యే కూనంనేని
మరోసారి రేవంత్ రెడ్డి సీఎం అయితే రాష్ట్రంలో పేదలందరికీ ఇండ్లు రావడం ఖాయమని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. నిప్పు కణిక లాంటి రేవంత్‌కు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గోదావరి నీళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలివ్వాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో చిన్న చిన్న లోపాలున్నా అడ్జస్ట్ చేసే విధంగా ఆదేశాలివ్వాలని సీఎంను కోరారు.
ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రామసహాయం రఘురామిరెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి, రాందాస్ నాయక్, హౌసింగ్ ఎండీ గౌతం, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ బి. రోహిత్‌రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, అడిషనల్కలెక్టర్డి.వేణుగోపాల్పాల్గొన్నారు.