బీజేపీ, కాంగ్రెస్ దేశాన్ని, రాష్ట్రాన్ని దివాలా తీయించాయి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

బీజేపీ, కాంగ్రెస్ దేశాన్ని, రాష్ట్రాన్ని దివాలా తీయించాయి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు రాష్ట్రాన్ని, దేశాన్ని దివాలా తీయించాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపిచారు. కాంగ్రెస్ కు రాష్ట్రంలో 60 చోట్ల పోటీ చేసే వాళ్లే లేరన్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహిస్తున్నామని, కేంద్రంలో మాత్రం క్రీడాకారులపై దాడులు, కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ రాజ్యమంటే మళ్లీ రూ.2 వేల పెన్షన్ పోయి, రూ.200 పెన్షన్ వస్తుందని ఎద్దేవా చేశారు. 24 గంటల కరెంట్ పోయి 3 గంటల కరెంట్ మాత్రమే వస్తుందన్నారు. 

70 ఏళ్లు పాలించి 17 గురుకులాలు పెడితే, తాము తొమ్మిదేళ్లలో 1000 గురుకులాలు పెట్టామని చెప్పారు. గతంలో వ్యవసాయానికి నీళ్లు లేక ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేవారని అన్నారు. ఇప్పుడు వ్యవసాయం పండగ చేసిన ఘనత కేసీఆర్ దే అని చెప్పారు. రాష్ర్టంలో బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉన్న కరెంట్ తీసేస్తారని చెప్పారు. ప్రతి కులానికి, ప్రతి వర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉన్నారని అన్నారు. 

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎంపీ మన్నే శ్రీవాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ సురభివాణి పాల్గొన్నారు. నందిగామ మండలంలో సబ్ స్టేషన్, చటాన్ పల్లిలో సబ్ స్టేషన్, షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, గ్రంథాలయం, నైట్ షెల్టర్ ను ప్రారంభించారు. షాద్ నగర్ నుండి కేశంపేట రోడ్డు, పాత జాతీయ రహదారి, చటాన్ పల్లి రైల్వేబ్రిడ్జి పనులకు శంకుస్థాపనలు చేశారు.