ప్ర‌తిప‌క్ష‌నేత‌లు పిచ్చిప‌ట్టిన‌ట్లుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

ప్ర‌తిప‌క్ష‌నేత‌లు  పిచ్చిప‌ట్టిన‌ట్లుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

ప్రతి పక్షాలు రోజు రోజుకు దిగజారుతున్నాయ‌ని, పిచ్చి పట్టినట్టు ప్రతిపక్ష నేతలు ప్రవర్తిస్తున్నార‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్, బీజేపీ నేత‌ల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 70ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా గురించి ఎప్పుడైనా కాంగ్రెస్ నేతలు ఆలోచించారా ? గతంలో ఎప్పుడైనా ఉస్మానియా ను సందర్శించారా? అని మంత్రి ప్ర‌శ్నించారు. సీఎం కేసీఆర్ త‌న ముందు చూపుతో 2015 లోనే ఉస్మానియా కు కొత్త భవనాన్ని ప్రతిపాదిస్తే కాంగ్రెస్ నేత‌లు అడ్డుకున్నార‌ని, అప్పుడు అడ్డుకున్న వారే ..ఇప్పుడు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. ఉస్మానియా ఆస్పత్రి కడితే కాంగ్రెస్ నేత‌లు తలలు నరుక్కుంటామని గ‌తంలో అన్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. వాళ్లకు అల్జీమర్స్ వ్యాధి సోకినట్టుందని విమ‌ర్శించారు. కిషన్ రెడ్డి ,దత్తాత్రేయ ,ఉత్తమ్ ,భట్టి అందరూ ఉస్మానియా కు కొత్త భవనాన్ని వ్యతిరేకించారని అన్నారు.

కాంగ్రెస్ నేతలు 1978 నుంచి 2009 దాకా తెలంగాణ కు ఒక కొత్త మెడికల్ కాలేజీ ఎందుకు తేలేక పోయారని శ్రీనివాస్ గౌడ్ ప్ర‌శ్నించారు. తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చింద‌న్నారు. మహబూబ్ నగర్ కు ఆధునాతన మెడికల్ కాలేజీ తీసుకొచ్చి పేదలకు మేలు చేశామ‌న్నారు. కేసీఆర్ ఉద్యమంలో మొత్తుకుంటే తప్ప రెండు మెడికల్ కాలేజీలు ఇవ్వలేద‌ని ఉస్మానియా లోని ఖాళీ జాగా లో నాలుగు అంతస్థులకు మించి భవనం కట్టడానికి లేదని ఆ అజ్ఞానులకు తెలియదా ? ఉస్మానియా కు ప్రస్తుతం ఉన్న చోట భవనం కట్టకుండా.. వేరే చోట కడితే మెడికల్ సీట్లు పోతాయనే జ్ఞానం లేదా ? అని కాంగ్రెస్ నేత‌ల‌నుద్దేశించి అన్నారు. కాంగ్రెస్ కు అధికారం లో ఉండగా విజన్ లేదు ..ఇపుడు అంత కన్నా లేదని అన్నారు. కళ్లలో కట్టెలు పెట్టడమే కాంగ్రెస్ ,బీజేపీ ల పని …ఢిల్లీ లో ఆ రెండు పార్టీలు కొట్లాడుకుంటాయి. తెలంగాణ లో మాత్రం కలిసి పనిచేస్తాయి .ఇదేం నీతి అని అన్నారు. కోర్టులకు పోయి అభివృద్ధిని అడ్డుకోవడమే పతిపక్షాల పని అన్నారు.

ఉస్మానియా కు కొత్త కట్టడాన్ని ఇపుడున్న స్థలం లో కడితే అడ్డుకోబోమని ప్రతిపక్షాలు హామీ ఇస్తే ఒక్క ఏడాది లోనే అద్భుత భవనాన్ని కట్టి చూపిస్తామ‌న్నారు. వారసత్వ కట్టడాల పేరుతో కొత్త భవనాల నిర్మాణాన్ని ఆపొద్దని అన్నారు.

కరోనా కంటే కాంగ్రెస్సే ప్రమాదకారి

ప్రతిపక్షాలు సృష్టించే భయాందోళనలతో బతుకుతారనుకుంటున్న కరోనా రోగులు చనిపోతున్నారని మంత్రి అన్నారు. వైద్య రంగం లో టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన మార్పులేమిటో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ కిట్ తీసుకున్న వారిని, సీఎంఆర్ఎఫ్ తీసుకున్న వారిని అడిగితే తెలుస్తుందన్నారు. ఓ పద్ధతి ప్రకారం సీఎం కేసీఆర్‌ను బద్నామ్ చేసేందుకు కాంగ్రెస్ ,బీజేపీ లు కుట్ర పన్నాయన్నారు. ప్రజలకు అన్నీ విషయాలు తెలుస‌ని, ఇలాంటి కుట్రలను వారే అడ్డుకుంటారని అన్నారు. కేసీఆర్ కు మంచి పేరు రావడాన్ని ప్రతిపక్షాలు ఓర్వలేకనే సైంధ‌వ‌ పాత్ర పోషిస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయన్నారు. ఉస్మానియా కు భవనం కట్టొద్దు. పేదలు వాళ్ళ చావు వాళ్ళు చావాలనే వైఖరి తో ప్రతిపక్షాలు రాక్షస క్రీడ ఆడుతున్నాయన్నారు. సమైక్య పాలనలో పాలకుల అడుగులకు మడుగులొత్తిన నేతలు ఇపుడు అదే పంథా తో తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నార‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమ‌ర్శించారు.