హరగోపాల్ కు కాళోజీ అవార్డు ప్రదానం

హరగోపాల్ కు కాళోజీ అవార్డు ప్రదానం
  • సామాన్యుడికి అర్థమయ్యేలా ఆయన కవితలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
  • తెలంగాణ ఆణిముత్యం కాళోజీ: మహమూద్​అలీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ భాషకు పట్టం కట్టిన కవి కాళోజీ నారాయణరావు అని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ఆయన కవితలు ఉంటాయని పేర్కొన్నారు. ఆయన విప్లవ కవి, ప్రజా కవి అని ప్రశంసించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలు, తెలంగాణ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్​గౌడ్​తో పాటు హోం మంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న హాజరయ్యారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత ఎంతో మంది మహనీయుల పేరిట అవార్డులు అందజేస్తున్నామని, కాళోజీ అవార్డుకు సరైన వ్యక్తి హరగోపాల్ అని అన్నారు. మహమూద్ అలీ మాట్లాడుతూ కాళోజీ తెలంగాణ ఆణిముత్యమన్నారు. కాళోజీ తెలంగాణ అస్తిత్వం అని ఎమ్మెల్సీ వెంకన్న అన్నారు. 

హరగోపాల్ కు కాళోజీ అవార్డు ప్రదానం
ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్‌ కు ప్రభుత్వం కాళోజీ నారాయణరావు అవార్డు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆయనను మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. ఈ వేడుకల్లో తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌ మంత్రి శ్రీదేవి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, కవి, రచయిత సుద్దాల అశోక్ తేజ, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ పాల్గొన్నారు.