చాక్నవాడిలో కుంగిన నాలాను పరిశీలించిన మంత్రి తలసాని

చాక్నవాడిలో కుంగిన నాలాను పరిశీలించిన మంత్రి తలసాని

హైదరాబాద్ లోని గోషామహల్ చాక్నవాడిలో ఉన్నట్టుండి పెద్ద నాలా కుంగింది. శుక్రవారం వీక్లీ మార్కెట్ కావడంతో వ్యాపారులు తమ దుకాణాలు ఏర్పాటు చేసుకుంటుండగా ఇది జరిగింది. దాదాపు 100 మీటర్ల మేర కుంగిపోవడంతో.. రోడ్డుపై నిలిపిన వాహనాలు, తోపుడు బండ్లన్నీ అందులో పడిపోయాయి. ముగ్గురికి గాయాలయ్యాయి. నాసిరకంగా పనులు చేయడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు, ప్రతిపక్ష పార్టీల నేతలుమండిపడ్డారు. 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద నాలా కుంగింది. రోడ్డు కింద ఉన్న నాలా కుంగిపోవడంతో జనం భయంతో పరుగులు తీశారు. దాదాపు 100 మీటర్ల మేర నాలా కుంగిపోవడంతో.. రోడ్డుపై నిలిపిన వాహనాలు అందులో పడిపోయాయి. ఈ ఘటన గోషామహల్ లోని చాక్నవాడిలో జరిగింది. శుక్రవారం వీక్లీ మార్కెట్ కావడంతో వ్యాపారులు తమ దుకాణాలు ఏర్పాటు చేసుకుంటుండగా నాలా కుంగింది. దీంతో తోపుడు బండ్లన్నీ అందులో పడిపోయాయి. రెండు కార్లతో పాటు ఐదారు టూవీల్లర్లు, ఆటో, నాలుగు తోపుడు బండ్లు గుంతలో పడిపోయాయి. ముగ్గురికి చిన్న గాయాలయ్యాయి. నాసిరకంగా పనులు చేయడంతో పాటు జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు మండిపడ్డారు. ‘‘40 ఏండ్ల కింద నాలాపై రోడ్డు వేశారు. ఆ తర్వాత 20 ఏండ్లకు ఒకసారి మరమ్మతులు చేశారు. మళ్లీ రోడ్డు పనులు చేపట్టినప్పటికీ నాసిరకంగా చేశారు. దీంతో రోడ్డు పూర్తిగా దెబ్బతినడం.. చుట్టు పక్కల ట్రాన్స్ పోర్ట్, టింబర్ డిపోలు, ఫ్లైవుడ్ దుకాణాలు ఉండటంతో లారీలు, ట్రక్కులు  ఓవర్ లోడ్ తో తిరుగుతుండటంతో రోడ్డు కుంగిపోయింది” అని చెప్పారు. నాలా పరిస్థితిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, మరమ్మతులు చేపట్టి ఉంటే ప్రమాదం జరిగేది కాదన్నారు. 1980, 1990లోనూ నాలా కుంగిందని తెలిపారు. నాలా కుంగడంతో నష్టపోయినోళ్లకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. కార్పొరేటర్లు రాజశేఖర్ రెడ్డి, విజయారెడ్డి, నాయకుడు మెట్టు సాయి తదితరులు ధర్నా చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా, అఫ్సర్ సాగర్, దారుసలెం, చాక్నవాడి, గోషామహల్ పోలీస్ స్టేడియం, ఉస్మాన్ గంజ్, గౌలిగూడ మీదుగా మూసీ నదిలోకి ఈ నాలా ద్వారా  మురికి నీరు ప్రవహిస్తోంది. 

ఆక్రమణలతోనే ప్రమాదాలు: తలసాని

కుంగిన నాలాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తలసాని అన్నారు. ఆక్రమణలను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ‘‘నాలా కుంగినప్పుడు ప్రజలు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రజలు కూడా అధికారులకు సహకరించి రూల్స్ పాటించాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ కొత్త రోడ్డు వేయిస్తం” అని చెప్పారు. హెవీ వెహికల్స్ రావడంతోనే నాలా కుంగిపోయిందని స్థానికులు చెబుతున్నారని మేయర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఇకపై హెవీ వెహికల్స్ రాకుండా చూస్తామన్నారు. 

నాసిరకం పనుల వల్లే ప్రమాదం: రాజాసింగ్

నాలా నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కుంగిపోయిన నాలాను ఆయన పరిశీలించారు. ‘‘2009లో నాలాపై స్లాబ్ వేశారు. కానీ నాసిరకంగా పనులు చేపట్టడంతో నాలా కుంగిపోయింది. నష్టపోయినోళ్లకు పరిహారం ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభు త్వం నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పాత నాలాలతోనే ప్రమాదాలు జరుగుతున్నా యని, కుంగిపోయిన నాలాను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాలన్నారు.