గవర్నర్ రాజకీయ నేతలా  మాట్లాడ్తరా?

గవర్నర్ రాజకీయ నేతలా  మాట్లాడ్తరా?

ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందిస్తున్నరు: తలసాని
ఆ పదవిలో ఉండి ఏది  పడితే అది మాట్లాడొద్దు 
 ‘‘మేం నామినేటెడ్ వ్యక్తులం కాదు” అని కామెంట్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గవర్నర్‌‌ తమిళిసై ఎక్కడికి వెళ్తే అక్కడ మీడియాతో మాట్లాడుతూ పొలిటికల్‌‌ లీడర్‌‌లా వ్యవహరిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌‌ ప్రెస్‌‌మీట్లు పెట్టి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌‌లో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు చేయడం మామూలే. కానీ సీఎంతో కలిసి పని చేయడం టఫ్‌‌, ఇష్టం లేదు అని గవర్నర్ చెప్పడం సరికాదు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్‌‌ కాదు” అని తలసాని అన్నారు. తమను ప్రజలు ఎన్నుకున్నారని, తాము నామినేటెడ్‌‌ వ్యక్తులం కాదని కామెంట్ చేశారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్‌‌ పరిధి ఎంత  అనేది రాజ్యాంగంలో ఉందన్నారు. ప్రజలకు ఏమైనా కష్టనష్టాలు ఎదురైతే, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే తప్ప గవర్నర్‌‌ది కాదన్నారు. 
 

ప్రొటోకాల్ లో పరిమితులుంటయ్...  
ప్రొటోకాల్‌‌ అనేది ఆ డిపార్ట్‌‌మెంట్‌‌ పరిధిలోని అధికారులు చూసే వ్యవహారమని తలసాని చెప్పారు. గవర్నర్‌‌ విషయంలో ప్రొటోకాల్‌‌ పాటించడం లేదని ఆరోపించడం సరికాదన్నారు. ‘‘ఉప రాష్ట్రపతి కన్నా గవర్నర్ పరిధి చాలా తక్కువ. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడే ప్రొటోకాల్‌‌ విషయంలో పరిమితులు ఉంటయన్నరు. రాష్ట్ర గవర్నర్‌‌ ఆ విషయం తెలుసుకోవాలి. గవర్నర్‌‌ తన బాధ్యతలు నిర్వర్తించాలి. అయినా ముఖ్యమంత్రికి గవర్నర్‌‌తో రోజూ ఏం పని ఉంటుంది” అని అన్నారు.