కవిత ఏ తప్పుచేయలే కాబట్టే చిరునవ్వుతో తిరిగొచ్చింది: మంత్రి తలసాని 

కవిత ఏ తప్పుచేయలే కాబట్టే చిరునవ్వుతో తిరిగొచ్చింది: మంత్రి తలసాని 

దేశంలో ప్రతిపక్షం ఉండొద్దు అనే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. దేశంలో అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారాయన. ఈడీ,సీబీఐ వంటి ప్రభుత్వ సంస్థలను బీజేపీ ప్రభుత్వం తమ ఏజెంట్లుగా మార్చుకుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కి తప్ప వేరే పార్టీలకు అవకాశం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయకులు దేవుళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తున్నరని తలసాని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని దేవాలయాలకు మహర్ధశ వచ్చిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపులో భాగంగా కవితపై ఈడీ దాడుల పేరుతో వేధిస్తున్నారని తలసాని వెల్లడించారు. కవిత ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంతో ఈడీ విచారణను సైతం ఎదుర్కొని చిరునవ్వుతో బయటకు వచ్చిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కవిత పట్ల చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా మహిళలు తలదించుకునే విషయమని ధ్వజమెత్తారు. హిందూ ధర్మం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ నాయకులు మహిళల పట్ల చేస్తున్న వ్యాఖ్యాలే మీ సంస్కారానికి నిదర్శనం అంటూ తలసాని ఎద్దేవ చేశారు. స్టేషన్ ఘనపూర్ మహిళా సర్పంచ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపడుతుందని స్పష్టం చేశారు. సరైన ఆధారాలు ఉంటే సీఎం కేసీఆర్ ఎవ్వరినీ ఉపేక్షించరని తెలిపారు. రాబోయే శాసన సభ ఎన్నికల్లో వందకు పైగా సీట్లలో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని జోశ్యం చెప్పారు. దేశంలో తమ పార్టీతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి దేశంలో మార్పుకు శ్రీకారం చుడుతామన్నారు మంత్రి తలసాని.