సబ్సిడీపై బర్లు ఇస్తం

సబ్సిడీపై బర్లు ఇస్తం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పాడి పశువుల సబ్సిడీ పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తామని, రంగారెడ్డి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో 32 ఎకరాల్లో రూ.246 కోట్లతో నిర్మించనున్న విజయ మెగా డెయిరీకి మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విజయ డెయిరీని పట్టించుకోలేదని తలసాని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల రైతులను ప్రోత్సహించారని, లీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.4 ఇన్సెంటివ్ ఇస్తున్నారని చెప్పారు. ఏడాదికి రూ.300 కోట్లున్న విజయ డెయిరీ టర్నోవర్ ను ఏడేండ్లలో రూ.750 కోట్లకు పెంచామని తెలిపారు. మొదట్లో పాల సేకరణ లక్ష లీటర్లు ఉండగా, దాన్ని 4.50 లక్షల లీటర్లకు పెంచామన్నారు. సహకార సంఘాల్లో 2.13 లక్షల మంది రైతులు ఉన్నారని పేర్కొన్నారు. కొందరు లీడర్లు మైక్ దొరికింది కదా అని ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 50 ఏండ్లు పాలించినోళ్లు ఇలాంటి పథకాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 
రెండేండ్లలో పూర్తి... 
మెగా డెయిరీని రెండేండ్లలో పూర్తి చేస్తామని, ఆ తర్వాత 8 లక్షల లీటర్ల పాలను సేకరిస్తామని తలసాని వెల్లడించారు. ఈ డెయిరీతో వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఒక్క గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోనే 35 లక్షల లీటర్ల మిల్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందన్నారు. విజయ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని.. రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల ఔట్ లెట్లు, 600 పార్లర్లు ఉన్నాయని, వీటిని మరింత విస్తరిస్తామని తెలిపారు. మెగా డెయిరీకి భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని సబితారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా 14 రకాల ఉత్పత్తులను మార్కెట్ లోకి విడుదల చేశారు. విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.