రాష్ట్రంలో యూరియా కొరత లేదు : మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

 రాష్ట్రంలో యూరియా కొరత లేదు : మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
  • మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, అన్ని జిల్లాల్లో సరిపడా యూరియా నిల్వలున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు వెల్లడించారు. కొందరు కావాలనే యూరియా కొరత ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ రైతుల్లో  అనవసర ఆందోళన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆయన  ఓ ప్రకటన రిలీజ్ చేశారు. 

యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌కు మొత్తం 10.40 లక్షల టన్నుల యూరియా అవసరమని , ఇందులో ఇప్పటికే  4 లక్షల  టన్నులను రైతులకు సరఫరా చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మరో 2 లక్షల  టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు.  గత ఏడాది డిసెంబర్ నెల అమ్మకాలతో పోల్చితే ఈసారి డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో రైతులు లక్ష టన్నుల యూరియాను ఇప్పటికే అదనంగా  కొనుగోలు చేశారని వివరించారు. 

ప్రతి రైతుకూ యూరియా బస్తాలు

సొసైటీలకు, రిటైల్ షాపులకు వచ్చే ప్రతి రైతుకు యూరియా బస్తాలు అందుతాయని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. యూరియా యాప్ అమలవుతున్న జిల్లాల్లో  ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సరఫరా జరుగుతోందన్నారు. ఇప్పటివరకు 5 జిల్లాల్లో దాదాపు లక్ష మంది రైతులు యాప్ ద్వారా 3.19 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేశారని తెలిపారు.