
- వ్యవసాయ పథకాలను ఒక్కొక్కటిగా మళ్లీ తెస్తున్నాం
- గత ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడంతో రైతులకు రూ.3 వేల కోట్ల నష్టం జరిగిందని ఫైర్
హైదరాబాద్, వెలుగు: రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా తమ ప్రజాప్రభుత్వం ముందుకు పోతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర-, రాష్ట్ర వాటాలతో అమలయ్యే వ్యవసాయ పథకాలను ఒక్కొక్కటిగా మళ్లీ తెస్తున్నామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడంతో రైతులు దాదాపు రూ.3,000 కోట్ల మేర నష్టపోయారని ఆరోపించారు. గత వారం జాతీయ నూనె గింజల మిషన్‌ను పునరుద్ధరించామని ఆయన తెలిపారు.
గత సీజన్‌లో ప్రతి జిల్లాకు ఎంపిక చేసిన మండలంలో 1,39,000 మట్టి నమూనాలు సేకరించి విశ్లేషణ పూర్తి చేసి ఫలితాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. మరో 1,70,000 మట్టి నమూనాలు విశ్లేషణ దశలో ఉన్నాయని వెల్లడించారు. ‘‘సహజ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. దీని కింద క్లస్టర్ల గుర్తింపు, శిక్షణ పూర్తి చేశాం. ఒకవైపు వానాకాల పంటల కొనుగోళ్ల ప్రక్రియను కొనసాగిస్తూనే, మరోవైపు యాసంగి పథకాల అమలుపై పూర్తిస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి రైతుల ఆర్థికాభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. కేంద్ర నిధులను పూర్తి స్థాయిలో వినియోగించేందుకు రాష్ట్ర వాటా విడుదల చేస్తున్నారు.
రాష్ట్రంలో వరితోపాటు పప్పుదినుసులు, నూనె గింజల సాగును పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ యాసంగిలో రూ.2.68 కోట్ల సబ్సిడీతో 19,397 ఎకరాలకు సరిపడా 5,825 క్వింటాళ్ల శనగ విత్తనాలను 14 జిల్లాలలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశాం” అని మంత్రి పేర్కొన్నారు. గత వారం పంపిణీ చేసిన వేరుశనగతో పాటు 83.78 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు (టిల్‌హాన్ టెక్-సన్-1) హైబ్రిడ్ విత్తనాలు, 74 క్వింటాళ్ల కుసుమ విత్తనాలకు రూ.45.41 లక్షలు వినియోగించి సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. 2025-–26లో రూ.48.54 కోట్లతో జాతీయ ఆహార భద్రత పథకాన్ని అమలు చేస్తామని, విత్తనాలతో పాటు ప్రదర్శన క్షేత్రాలు, విత్తనోత్పత్తి కార్యక్రమాలు చేపట్టనున్నామని తుమ్మల వివరించారు.