ఆలస్యంగా వచ్చినోళ్లపై చర్యలు తీస్కోండి : మంత్రి తుమ్మల

ఆలస్యంగా వచ్చినోళ్లపై చర్యలు తీస్కోండి : మంత్రి తుమ్మల
  • మార్కెటింగ్  డైరెక్టర్​కు మంత్రి తుమ్మల ఆదేశం
  • ప్రధాన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ
  • ఆఫీసుల్లో  ఫేస్  రికగ్నిషన్  బయోమెట్రిక్ వ్యవస్థ పెట్టాలని సూచన

హైదరాబాద్, వెలుగు: రాజధాని హైదరాబాద్ లోని మార్కెటింగ్  ప్రధాన కార్యాలయంలో వ్యవసాయ మంత్రి తుమ్మల ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం బీఆర్కే భవన్ లోని మార్కెటింగ్  ఆఫీసుకు వెళ్లిన మంత్రి తుమ్మల ...ఉద్యోగులు ఆలస్యంగా అటెండ్  కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్  డైరెక్టర్‌‌‌‌ను ఆదేశించారు. తనిఖీ సందర్భంగా మార్కెటింగ్  డైరెక్టర్  సమర్పించిన నివేదిక ప్రకారం 53 మంది రెగ్యులర్  సిబ్బందిలో 16 మంది, 42 మంది ఔట్‌‌‌‌సోర్సింగ్ సిబ్బందిలో ఐదుగురు ఆలస్యంగా హాజరైనట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆలస్యమైన సిబ్బందికి మెమోలు జారీ చేసి, సంజాయిషీ తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇకపై ఆలస్యాలను నివారించేందుకు మార్కెటింగ్  శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని కార్యాలయాల్లోనూ ఫేస్  రికగ్నిషన్  సాంకేతికతతో కూడిన బయోమెట్రిక్  వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.  రైతులకు అందుబాటులో లేని లేదా విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సిబ్బంది హాజరు వివరాలను తన కార్యాలయానికి రోజూ పంపాలని మార్కెటింగ్  డైరెక్టర్‌‌‌‌కు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు సకాలంలో సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.