కేటీఆర్‌కు మంత్రి తుమ్మల కౌంటర్ : సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్టింగ్ మాస్టర్

కేటీఆర్‌కు మంత్రి తుమ్మల కౌంటర్ : సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్టింగ్ మాస్టర్

ఖమ్మం టౌన్, వెలుగు: సర్కార్ స్కీములను పేదలకు, అర్హులకు ఇవ్వడం.. అనర్హులను పక్కనపెట్టడం తప్పు ఎలా అవుతుందని బీఆర్ఎస్ లీడర్లను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు నిలదీశారు. తమ ప్రభుత్వంలో అర్హులకు మాత్రమే పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. సీఎం అంటే.. కటింగ్ మాస్టర్ కాదని.. కరెక్టింగ్ మాస్టర్ అన్న విషయం కేటీఆర్​ గుర్తు పెట్టుకోవాలంటూ మంత్రి తుమ్మల సోమవారం ప్రకటన విడుదల చేశారు. 

‘‘కాంగ్రెస్ హయాంలో సీఎం పదానికి కొత్త నిర్వచనం ఉంది. బీఆర్ఎస్ నేతలు అంటున్నట్టు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్టింగ్ మాస్టర్. మా ప్రభుత్వంలో నిరుపేదలు, అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలను వర్తింపజేస్తాం. దుబారాకు దూరంగా పథకాల అమలు ఉంటుంది. సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా మాపైనే ఉంది. ఇవి రెండూ ప్రభుత్వ ప్రాథమిక సూత్రాలు. అందుకే అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటున్నం’’అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. 

రైతు భరోసా లేట్ అవుతుండడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడ్తున్నారని తెలిపారు. కావాలని తాము ఆలస్యం చేయడం లేదని చెప్పారు. రైతు భరోసాను ఆదర్శవంతంగా అమలు చేయడమే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చి.. వారి పురోగతికి తోడ్పాటు అందించడమే తమ ఉద్దేశమని తెలిపారు. కొంత ఆలస్యమైనప్పటికీ.. పక్కాగా రైతు భరోసా అమలు చేస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగానే విధి విధానాల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని తుమ్మల స్పష్టం చేశారు.