ఇక యూరియా కష్టాలు తీరినట్లే ! రాష్ట్రానికి 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా: మంత్రి తుమ్మల

ఇక యూరియా కష్టాలు తీరినట్లే ! రాష్ట్రానికి 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా: మంత్రి తుమ్మల

పనులు వదులుకుని యూరియా కోసం పడిగాపులు కాసే పరిస్థితి ఇక నుంచి ఉండదని రైతులకు గుడ్ చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి రావాల్సిన యూరియాను సాధించినట్లు శనివారం (సెప్టెంబర్ 05) సమీక్ష సందర్భంగా చెప్పారు. వచ్చే 20 రోజులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని గట్టిగా కోరినట్లు చెప్పిన మంత్రి.. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రానికి యూరియా వచ్చినట్లు తెలిపారు.

శనివారం (సెప్టెంబర్ 05) రాష్ట్రానికి 11 వేల181 మెట్రిక్ టన్నుల యూరియా చేరిందని మంత్రి తుమ్మల తెలిపారు.  రేపు (సెప్టెంబర్ 06) మరో 9 వేల 39 మెట్రిక్ టన్నులు రానుందని సమీక్ష సందర్భంగా చెప్పారు. అదే విధంగా - వచ్చే 20 రోజులకు సరిపడా.. రోజుకు 10 వేల మెట్రిక్ టన్నుల చొప్పున యూరియాను రాష్ట్రానికి సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని గట్టిగా కోరినట్లు తెలిపారు. 

రైతు వేదికల వద్ద అదనపు సేల్ కౌంటర్ల:

- యూరియా సరఫరా పెరుగుతున్న క్రమంలో రైతు వేదికల వద్ద అదనపు యూరియా సేల్ కౌంటర్లు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల.  సెప్టెంబర్ నెలలో గత నాలుగు రోజులలో రాష్ట్రానికి 28 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయినట్లు తెలిపారు. రైతులకు ఎరువులు సులభంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు మంత్రి. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా చేపట్టిన పంపిణీ విధానం సత్ఫలితాలు ఇస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద అదనపు యూరియా సేల్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

ఒకరోజు ముందుగానే టోకెన్లు:

మండలానికి ఒకటి లేదా రెండు PACS మాత్రమే ఉన్న ప్రాంతాలలో రైతు వేదికలను వాడుకొని గ్రామాల వారీగా, పాస్ పుస్తకాల ఆధారంగా ఒక రోజు ముందుగానే టోకెన్లు జారీ చేసి రైతులకు ఎరువులు అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుగానే టోకెన్లు ఇవ్వడం ద్వారా రైతులు ఇబ్బందులు లేకుండా యూరియా పొందగలుగుతున్నారని మంత్రి తెలిపారు.

ఈ పంపిణీ ప్రక్రియలో ఎక్కడా అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. కోఆపరేటివ్, మార్క్‌ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించామని తెలిపారు. పోలీస్, విజిలెన్స్ విభాగాలతో కూడిన పర్యవేక్షణ వలన ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

►ALSO READ | హైదరాబాద్‎కు సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్.. కాళేశ్వరం కేసు కోసమేనా..?

ఢిల్లీ పర్యటనలో రాష్ట్రంలో యూరియా పరిస్థితులను కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వానాకాలం సాగు విస్తారంగా సాగుతున్న ప్రస్తుత సమయంలో రైతులు యూరియా ఎరువుల కొరతను ఎదుర్కొంటున్నారని మంత్రి సోదాహరణంగా వివరించి, వచ్చే 20 రోజుల్లో 2 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని గట్టిగా కోరారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, తూర్పు తీరంలోని వివిధ నౌకాశ్రయాలకు రానున్న నాలుగు దిగుమతి నౌకల నుండి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియా కేటాయించేందుకు అంగీకరించింది. ఈ నిర్ణయం వల్ల రైతులు ప్రస్తుత పంట దశలో సకాలంలో ఎరువులు పొందగలుగుతారని మంత్రి వెల్లడించారు.

అదనపు యూరియా సరఫరాకు కేంద్రం అంగీకారం:

దిగుమతి సరఫరా కాకుండా, RFCL మూత పడటంతో కేంద్రం దేశీయ తయారీ యూనిట్ల నుండి కూడా అదనంగా 30,000 మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడానికి కేంద్రం అంగీకరించినట్లు తెలిపారు. దీని వలన రాష్ట్రంలో ఎరువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉంటుందని మంత్రి తుమ్మల గారు స్పష్టం చేశారు. అంతేకాకుండా, రామగుండం RFCL ఎరువుల కర్మాగారం నిలిచిపోయిన కారణంగా రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణలోనికి తీసుకొని వెంటనే ఉత్పత్తి ఆరంభించేలా చర్యలకు ఉపక్రమించాలని కేంద్ర మంత్రులను కోరడం జరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని వచ్చే 3,4 రోజుల్లో యూనిట్ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ పరిణామాలతో తెలంగాణలో ఎరువుల లభ్యత మరింత మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు.

ఈ రోజు (శనివారం సెప్టెంబర్ 05) రాష్ట్రానికి GSFC,IPL,CIL- కరాయికల్, CIL-కాకినాడ కంపెనీల ద్వారా 11,181 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రంలోని రైల్వే రేక్ పాయింట్లయిన కరీంనగర్, మిర్యాలగూడ, వరంగల్, పెద్దపల్లి ప్రాంతాలకు చేరిందని తెలిపారు. ఆదివారం మరో 9,039 మెట్రిక్ టన్నులు MFL, KRIBHCO, CIL-క్రిష్ణపట్నం కంపెనీల నుండి వరంగల్, సనత్ నగర్, కరీంనగర్ రైల్వే రేక్ పాయింట్లకు చేరనున్నాయని మంత్రి తెలిపారు. సెప్టెంబర్ నెలలో కేవలం నాలుగు రోజుల్లోనే రాష్ట్రానికి 28,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందని ఆయన వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,20,112 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, గత సంవత్సరం ఇదే సమయానికి 7,75,157 మెట్రిక్ టన్నుల అమ్మకాలు మాత్రమే జరిగాయని స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో  కేబినేట్ సెక్రటరీని కలసి వచ్చే 20 రోజుల్లో రోజుకు కనీసం 10,000 మెట్రిక్ టన్నుల చొప్పున 2 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి సరఫరా చేయాలని గట్టిగా కోరినట్లు వివరించారు.

రైతులు అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని, ఒకేసారి అధిక మొత్తంలో నిల్వ చేసుకోవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. యూరియా సరఫరా వేగవంతం చేయాలని కేంద్రాన్ని వరుసగా విజ్ఞప్తి చేస్తున్నామని, రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు.