నిజామాబాద్: రైతు భరోసా, రైతు బీమాపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రతి ఎకరాకు పంట బీమా చేస్తాం. త్వరలోనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తాం. రుణ మాఫీ పూర్తి కాగానే రైతు భరోసా అమలు చేస్తాం.. ఈ సీజన్లో కొనుగోలు చేసే సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తాం’’ అని ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్‌ను ఇవాళ (అక్టోబర్ 4) నిజామాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు సన్మానించారు.
మహేష్ కుమార్ గౌడ్ సన్మాన సభకు మంత్రి తుమ్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోడు గుర్రాళ్ల పని చేస్తూ.. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలను నెరవేర్చుతారని అన్నారు. వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. రైతును రాజును చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.