
- ఖమ్మం నియయోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం
ఖమ్మం టౌన్, వెలుగు : ఓటు చోరీ పద్ధతితోనే బీజేపీ దేశంలో మూడవ సారి అధికారంలోకి వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ‘ఓటు చోరీ’పై సంతకాల సేకరణను ఉద్యమంగా చేపట్టాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మం సిటీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆపార్టీ సిటీ అధ్యక్షుడు జావేదు అధ్యక్షతన ఓటు చోరీ, 22 నెలల కాంగ్రెస్ పాలన అభివృద్ధిపై ఖమ్మం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గంలో ని 346 బూత్‌ల్లో 2వందల మందికి తగ్గకుండా గ్రామాల్లో ఆయా గ్రామాల లీడర్లు, సిటీలోని 60 డివిజన్ల లోని పార్టీ కార్పొరేటర్లు, వారు లేని చోట డివిజన్ ఇన్చార్జ్ లు గడపడపకు వెళ్లి కాంగ్రెస్ 22 నెలల అభివృద్ధి, బీజేపీ ఓటు చోరీ, 42 శాతం బీసీ రిజర్వేషన్ కు అడ్డుపడే బీఆర్ఎస్, బీజేపీ ధోరణిని వివరించాలన్నారు. స్వయం ప్రతిపత్తితో ఉపయోగించే ఓటర్ల ఓటును బీజేపీ హరించిందన్నారు. రాహుల్ ఉద్యమాన్ని ప్రజలు బల పరచాలని కోరారు.
బీసీ రిజర్వేషన్ ను హైకోర్టు నెల పాటు వాయిదా వేయడంతో సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు.42 శాతం బీసీ రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ప్రజల నుంచి సేకరించిన సంతకాల పత్రాలు రాష్ట్రపతికి పంపనున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సిటీ మేయర్ నీరజ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, రాష్ట్ర విత్తన గిడ్డంగి సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వైరా వైఎమ్మెల్యే రాందాస్ నాయక్, కార్పొరేటర్లు, మండల నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి
అభివృద్ధి పనుల్లో వేగం పెంచి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మంత్రి అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్ లో మున్సిపల్ సాధారణ, టీయూఎస్ఐడీసీ నిధులు రూ.92 లక్షలతో సీసీ రోడ్లు, సీసీ సైడ్ డ్రైన్ లు, వాటర్ సప్లై పైప్ లైన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.