- అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్,వెలుగు : ఖమ్మం సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఖమ్మం సిటీ మమతా రోడ్డులోని 10, 11, 14, 19, 20, 21, 41 తో పాటు పలు వార్డులను సందర్శించారు.
10వ డివిజన్ లో అమృత్ పథకం కింద రూ. 249 కోట్లతో చేపట్టిన అండర్ గ్రౌండ్ నీటి పారుదల వ్యవస్థ పనులను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్ట్రార్మ్ వాటర్ డ్రైన్, మురుగు నీరు డ్రైనేజీలను వేర్వేరు పైప్ లైన్ల ద్వారా ఎస్టీపీలకు చేర్చేలా నిర్మిస్తున్నామని తెలిపారు.
ఆక్రమణలను తొలగించి వీలైనంత త్వరగా పైప్ లైన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వానాకాలం నాటికి కాల్వ పనులను పూర్తి చేసి ముంపు లేకుండా చూడాలని సూచించారు. 8.5 కిలో మీటర్లు మురుగు నీటి పైప్ లైన్(ఊర చెరువు నుంచి ధంసలాపురం చెరువు వరకు), మురుగు నీటి డ్రైన్ లు, అంతర్గత పైప్ లైన్లను అనుసంధానించి మురుగునీటి శుద్ధి కేంద్రానికి తరలించనున్నామని చెప్పారు.
ధంసలాపురం వద్ద 44 మిలియన్ లీటర్ల సామర్థ్యంలో మురుగునీటి శుద్ధి కేంద్రానికి అవసరమైన భూసేకరణను, పుట్టకోటలో 9.5 మిలియన్ లీటర్ల సామర్థ్యతో మురుగు నీటి శుద్ధి కేంద్రం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం కార్పొరేషన్ ఎస్ఈ వి. రంజిత్, ఇరిగేషన్ ఈఈ అననీయ, మునిసిపల్ కార్పొరేషన్ ఇన్ చార్జ్ ఈఈ టి. ధరణికుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ కె. నవీన్ కుమార్, ఏఈలు నవ్యజ్యోతి, దివ్య, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
