- ముస్తఫానగర్ లో బీసీ బాలుర వసతి గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం స్థానిక ముస్తఫానగర్ లో రూ.3 కోట్లతో నిర్మించనున్న బీసీ బాలుర వసతి గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగరంలో పాతబడి కూలిపోయే స్థితిలో ఉన్న 3 సంక్షేమ హాస్టళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.9 కోట్లు మంజూరు చేసిందన్నారు.
ప్రజల అంగీకారం ఉంటే బోనకల్ రోడ్డు వెడల్పు చేస్తామన్నారు. ప్రజలు ప్లాస్టిక్, చెత్తను రోడ్లు, మురుగు కాల్వల్లో వేయవద్దని సూచించారు. ఖమ్మం నగరంలో త్వరలో తాగునీటి సౌకర్యం కల్పన కోసం మరో రూ.220 కోట్లు మంజూరు చేస్తామన్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు, స్వామి నారాయణ స్కూల్ కూడా త్వరలో రాబోతున్నాయని చెప్పారు. రైల్వే స్టేషన్ రోడ్డు వెడల్పు పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
కార్పొరేటర్లు తమ డివిజన్ పరిధిలో వెడల్పు చేయాల్సిన రోడ్ల వివరాలు అందించాలని సూచించారు. మంత్రి వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, స్థానిక కార్పొరేటర్ రోజ్ లీన, కార్పొరేటర్లు, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఈఈలు రంజిత్, కృష్ణలాల్, మున్సిపల్ కార్పొరేషన్ సహాయ కమిషనర్ అనిల్ కుమార్ ఉన్నారు. అనంతరం ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని పి. శ్లోక ఐదేండ్లుగా ఎముకలకు వచ్చిన ట్యూమర్ తో ఇబ్బంది పడుతున్నందున చికిత్స కోసం రూ.లక్ష ఎల్ఓసీ అందజేశారు.
స్థిరమైన ఆదాయం ఆయిల్ పామ్ తోనే సాధ్యం
అశ్వారావుపేట: రైతులకు స్థిరమైన ఆదాయం ఆయిల్ పామ్ పంటతోనే సాధ్యమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం ఆయిల్ ఫెడ్ నర్సరీ వద్ద తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాక్య లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆధునిక పద్ధతిలో ఆయిల్ పామ్ విత్తనాలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, రాగమయితో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాలకు ఆయిల్ పామ్ పంట విస్తరింపజేశామన్నారు. ఆయిల్ పామ్ నర్సరీల్లో లక్ష పొట్టి రకం విత్తనాలను నాటుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆయిల్ పామ్ ఉత్పత్తి రంగంలో అగ్రస్థానంగా నిలుస్తుందని చెప్పారు. సిద్దిపేట ఫ్యాక్టరీ 120 టన్నుల కెపాసిటీతో నిర్మించామని, దీనిని త్వరలోనే సీఎం ప్రారంభిస్తారని తెలిపారు.
ప్రపంచంలో ఎక్కడ మంచి విత్తనం దొరికితే అది అశ్వారావుపేట నర్సరీలో ఉంటుందన్నారు. దమ్మపేట మండలం అప్పారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో ఓఈఆర్ ఆధారంగానే దేశంలో ఆయిల్ పామ్ ధరను నిర్ణయిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఆయిల్ పామ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్, ఎండీ శంకరయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, బండి భాస్కర్, చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు.
