గ్లోబల్ సీడ్ క్యాపిటల్గా ఎదగడమే లక్ష్యం..విత్తన రంగంలో దేశానికి రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తోంది : మంత్రి తుమ్మల

గ్లోబల్ సీడ్ క్యాపిటల్గా  ఎదగడమే లక్ష్యం..విత్తన రంగంలో దేశానికి రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తోంది : మంత్రి తుమ్మల
  • ఏటా కోటి క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడి
  • విదేశాలకు విత్తనాలు, బియ్యం ఎగుమతిని విస్తరిస్తామన్న మంత్రి ఉత్తమ్
  • సీడ్​ మెన్​ అసోసియేషన్​వార్షికోత్సవం సందర్భంగా సీడ్ కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. పాల్గొన్న మంత్రులు

హైదరాబాద్, వెలుగు: ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని.. త్వరలో గ్లోబల్ సీడ్ క్యాపిటల్ గా ఎదగడమే లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్ అసోసియేషన్ 30వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సీడ్ కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లేవ్ 2025లో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం విత్తన రంగంలో దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. గత 25 ఏండ్లుగా రైతులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమలు, ప్రభుత్వాల మధ్య వారధిగా సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్ అసోసియేషన్ విశేష సేవలందించిందని మంత్రి అభినందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా ఒక కోటి క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయని.. వాటిలో 75 లక్షల క్వింటాళ్లు వరి విత్తనాలేనని వివరించారు.

10 లక్షల క్వింటాళ్లు మొక్కజొన్న, మరో 10 లక్షల క్వింటాళ్లు జొన్నలు, చిరుధాన్యాలుగా ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. ప్రస్తుతం 8 లక్షల ఎకరాల్లో విత్తన ఉత్పత్తి సాగుతుండగా.. 3.5 లక్షల మంది రైతులు ఈ రంగంలో ప్రత్యక్షంగా ఉన్నారని తెలిపారు. ప్రతియేటా తెలంగాణ నుంచి రూ.2 వేల కోట్ల విలువైన లక్ష టన్నుల విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని.. ఆఫ్రికా–ఆసియా దేశాల్లో తెలంగాణ విత్తనాలకు ప్రత్యేక డిమాండ్ ఉందని మంత్రి తెలిపారు. 

“విత్తనం నాణ్యత కలిగి ఉంటే రైతు నమ్మకం పెరుగుతుంది. నాణ్యత తగ్గితే పంట, ఆదాయం, జీవనం ప్రమాదంలో పడతాయి” అని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. “వచ్చే 25 ఏండ్లలో పరిమాణం కంటే నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి” అని సీడ్ కంపెనీలకు మంత్రి సూచించారు. 

సీడ్​లో పరిశోధనలు, ఎగుమతుల విస్తరణ అవసరం: ఉత్తమ్

రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా స్థాయిని నిలబెట్టుకోవాలంటే పరిశోధన, ఎగుమతులు, మౌలిక సదుపాయాలపై మరింత దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. “వ్యవసాయంలో విత్తనమే కీలక ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్. అధిక దిగుబడి రకాలు రైతుల ఆదాయాన్ని నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎరువులు, నీటిపారుదల సామర్థ్యం పెరగడంలోనూ విత్తనమే కీలకం” అని ఉత్తమ్ పేర్కొన్నారు.

 సీడ్ కంపెనీలు అధిక దిగుబడి ఇచ్చే కొత్త వరి రకాల అభివృద్ధి, కూరగాయల విత్తనాల పరిశోధన, హైబ్రీడ్ విత్తనాల ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, బుర్కినా ఫాసో వంటి దేశాలకు విత్తన, బియ్యం ఎగుమతులు విస్తరిస్తున్నట్టు పేర్కొన్నారు. 

“సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ పరిశ్రమ తెలంగాణ పేరును ప్రపంచానికి చాటినట్టే.. సీడ్ పరిశ్రమ కూడా రాష్ట్రానికి  గ్లోబల్ గుర్తింపు తెస్తుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు. 1995లో స్థాపించిన సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్ అసోసియేషన్ ప్రస్తుతం 505 మంది సభ్యులతో బలంగా ఉందని.. ప్రతి సంవత్సరం వ్యవసాయ  విశ్వవిద్యాలయాలకు రూ.90 లక్షల నుంచి రూ.కోటి వరకు బ్రీడర్ సీడ్ సరఫరా చేస్తోందని మంత్రి వివరించారు.