- లక్ష్మణ్ చూపిన మార్గం తరతరాలకు స్ఫూర్తిదాయకం: దత్తాత్రేయ
- జలదృశ్యంలో ఘనంగా బాపూజీ జయంతి వేడుకలు
ముషీరాబాద్, వెలుగు: చేనేత రంగ అభివృద్ధికి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్‌లోని జలదృశ్యం ప్రాంగణంలో వేడుకలు నిర్వహించారు.
బాపూజీ విగ్రహానికి మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్లు బీఎస్ రాములు, వకుళాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, సీఎం బీసీ సలహాదారు వి.హనుమంతరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని తెలిపారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ లక్ష్మణ్ చూపిన మార్గం తరతరాలకు స్ఫూర్తిదాయకమని, ఆయన తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని కొనియాడారు.
మాజీ మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ మాట్లాడుతూ బాపూజీ కలలు కన్న సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం చేకూరే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
