నాణ్యమైన పంటను సత్వరమే కొనుగోలు చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

నాణ్యమైన పంటను సత్వరమే కొనుగోలు చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
  • ధాన్యం, పత్తి పంటల కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించిన మంత్రి తుమ్మల

ఖమ్మం టౌన్,వెలుగు : నాణ్యమైన పంట సత్వరమే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి ధాన్యం, పత్తి కొనుగోలుపై రివ్యూ చేశారు. నాణ్యత పరిశీలించి కొనుగోలు చేసిన తర్వాత రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు విధించరాదని స్పష్టం చేశారు. గన్ని బ్యాగులు, టార్పాలిన్ కవర్లు సిద్ధంగి ఉంచాలని, తేమ శాతం రాగానే వడ్ల కొనుగోలు పూర్తి చేసి రైస్ మిల్లులకు తరలించాలన్నారు. 

ధాన్యం కొనుగోలు అనుసరిస్తున్న విధానాన్ని పత్తి పంట కొనుగోలులోనూ పాటించాలన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్​లో తుమ్మల కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ఆకాశమే హద్దుగా ఎదిగేందుకు మహిళలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఆయన తెలిపారు. రఘునాధపాలెంలో రూ.కోటి 35 లక్షలతో నిర్మిస్తున్న బాల సదనానికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి శంకుస్థాపన చేశారు. 

ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గరీబీ హఠావో నినాదంతో పేదల అభ్యున్నతి కోసం శ్రమించిన మహా నాయకురాలు ఇందిరా గాంధీ అని, ఆమె జయంతి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని మహిళలకు పుట్టింటి నుంచి అందించే సారే లాగా ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు ఇస్తోందన్నారు. ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకు, సోలార్ విద్యుత్ ప్లాంట్ వంటి అనేక రంగాలలో మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని అన్నారు. ఖమ్మం జిల్లాలో 5.8 మెగా వాట్ల సామర్థ్యంతో 2 సోలార్ విద్యుత్ ప్లాంట్ లను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్​ అనుదీప్​ చెప్పారు. 

పుట్టింటి చీర అందినట్లుగా ప్రభుత్వం నుంచి అందే ఇందిరమ్మ చీరను పరిగణించాలని మహిళాసంఘాల సభ్యులు అన్నారు. అనంతరం మంత్రి మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. 54 కోట్ల 13 లక్షల బ్యాంక్ లింకేజ్ రుణాల చెక్కు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, లీడర్లు, అధికారులు పాల్గొన్నారు.

సమాజాన్ని అభిమానించే జాతిగా ఉండాలి

మధిర, వెలుగు: సమాజాన్ని అభిమానించే జాతిగా కమ్మవారు ఉండాలని, జాతి చరిత్రకు కళంకం తీసుకురావొద్దని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. బుధవారం మధిర మండలంలోని ఆత్కూరు అబ్బూరి రామకృష్ణ మామిడి తోటలో మధిర కమ్మ సంఘం ఆధ్వర్యంలో కార్తీకమాస వనసమారాధన కార్యక్రమం నిర్వహించారు. 

మంత్రి మాట్లాడుతూ.. పూర్వీకులు ఇచ్చిన ఘన కీర్తిని  కొనసాగించాలన్నారు. నాయకులు పుతుంబాక కృష్ణప్రసాద్, కరివేద వెంకటేశ్వరరావు, డాక్టర్​వాసిరెడ్డి రామనాథం, దొండపాటి వెంకటేశ్వరరావు, బి.వెంకటేశ్వరరావు, చావా రామకృష్ణ పాల్గొన్నారు.