నవంబర్ 15 నాటికి..ఇందిరమ్మ చీరలు సిద్ధం చేయండి : మంత్రి తుమ్మల

నవంబర్ 15 నాటికి..ఇందిరమ్మ చీరలు సిద్ధం చేయండి :  మంత్రి తుమ్మల
  • 64.69 లక్షల చీరల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నం: మంత్రి తుమ్మల 

హైదరాబాద్, వెలుగు: ఇందిరా మహిళా శక్తి కింద చీరల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌ రావు అన్నారు. నవంబర్ 15 నాటికి 64.69 లక్షల చీరలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియెట్‌‌‌‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, టెస్కో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

 మొత్తం 64 లక్షల 69 వేల 192 చీరలను సిద్ధం చేయాలన్నారు. అయితే, ఇప్పటివరకు 33.35 లక్షల చీరలు జిల్లా గోడౌన్లలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. చీరల తయారీలో 6,900 మంది నేత కార్మికులకు 6 నుంచి 8 నెలల పాటు ఉపాధి లభించిందన్నారు. చీరల పంపిణీ కార్యక్రమాన్ని నవంబర్ 15 నాటికి ప్రారంభించేందుకు సన్నాహాలు వేగవంతం చేసినట్లు వెల్లడించారు. 

మరోవైపు, చేనేత కార్మికుల రుణమాఫీని స్పీడప్‌‌‌‌ చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. నేతన్న భరోసా పథకం కింద ఈ ఏడాది రూ.48.80 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ పథకంలో చేనేత కార్మికులకు రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేలు చొప్పున రెండు విడతల్లో ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. 

అలాగే, ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సంస్థలు చేసే వస్త్ర కొనుగోళ్లు ఇకపై టెస్కో ద్వారానే 100 శాతం నిర్వహించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్‌‌‌‌లో తాత్కాలికంగా నడుస్తున్న ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌‌‌‌కు తరలించే ప్రక్రియను ప్రారంభించాలని తుమ్మల ఆదేశించారు.