భద్రాద్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి :మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

భద్రాద్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి :మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • ఆలయ అభివృద్ధి పనులను స్పీడప్‌‌ చేయండి
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు : భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌‌తో పాటు ఇతర ఆఫీసర్లతో శుక్రవారం సెక్రటేరియట్‌‌లో రివ్యూ నిర్వహంచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... భద్రాద్రి ఆలయ విస్తరణకు భూసేకరణ పూర్తయిందని, మాఢవీధుల విస్తరణ, ప్రాకార గోడల నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.

 భద్రాద్రి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. భద్రాద్రికి వచ్చే భక్తులకు వసతి, రవాణా, పార్కింగ్‌‌, నీటి సదుపాయాలను కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పనుల పురోగతి వివరాలపై ఎప్పటికప్పుడు రిపోర్ట్‌‌లు అందజేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రధానమైన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 

ఆలయాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను కాపాడుతూ అభివృద్ధిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ఖమ్మంలో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం మూడు ప్రాంతాలను గుర్తించి ప్రపోజల్స్‌‌ పంపినట్లు చెప్పారు. ఈ ఆలయం పూర్తి అయితే భక్తి, పర్యాటక రంగాల్లో ఖమ్మం అభివృద్ధి చెందుతున్నారు.