ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్ ఏర్పాటు చేస్తం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్ ఏర్పాటు చేస్తం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • ఈ పంట సాగుతో రైతులకు ఎక్కువ ఎక్కువ ఆదాయం: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: తెలంగాణను ఆయిల్ పామ్ సాగు కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం పెద్దవేడు గ్రామంలో జరిగిన ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో 100 లక్షల టన్నుల పామ్ ఆయిల్ డిమాండ్ ఉండగా, కేవలం 4 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. మరో 70 లక్షల ఎకరాల సాగు అవసరమని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 లక్షల ఎకరాల్లో, తెలంగాణలో 2.5 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోందని వివరించారు. 

ఆయిల్ పామ్ సాగు కోసం రైతులకు నాలుగేండ్ల పాటు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. రవాణా ఖర్చులను కంపెనీలు భరించడం, గెలల అమ్మకం తర్వాత మూడ్రోజుల్లో డబ్బులు జమ కావడం వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి తెలిపారు. ఆయిల్ పామ్ నాల్గవ ఏడాది నుంచి 35 ఏళ్ల వరకు ఆదాయం ఇస్తుందని, ఇతర పంటల కంటే ఎక్కువ రాబడి వస్తుందని తెలిపారు. రంగారెడ్డిలో 890 మంది రైతులు 3,029 ఎకరాల్లో సాగు చేస్తుండగా, ఈ ఏడాది చివరి నాటికి 4,000 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.