
- ఇండియా, ఆఫ్రికా సీడ్ సమిట్‌లో మంత్రి తుమ్మల వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: దేశంలోని 60% విత్తన అవసరాలను తెలంగాణ తీరుస్తోందని, 20కి పైగా దేశాలకు విత్తనాలు ఎగుమతి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో బేగంపేట్మ్యారీగోల్డ్ హోటల్లో నిర్వహించిన ఇండియా–ఆఫ్రికా సీడ్ సమిట్ 2025కు మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.." వెయ్యికిపైగా విత్తన కంపెనీలు, ఆధునిక పరిశోధన, ప్రాసెసింగ్, నిల్వ సౌకర్యాలు, నాణ్యతా ప్రమాణాలతో తెలంగాణ సీడ్ హబ్‌గా మారింది.
అంతర్జాతీయ గుర్తింపును కూడా సాధించింది. నాణ్యమైన విత్తనం లేకుండా పంట ఉత్పత్తి, రైతు ప్రగతి సాధ్యం కాదు. నాణ్యమైన విత్తనాల వల్లే గ్రీన్ రివల్యూషన్ విజయవంతమైంది. ఈ సమిట్ భారత్–ఆఫ్రికా దేశాల మధ్య వ్యవసాయ రంగంలో సంబంధాలను బలోపేతం చేసే వేదికగా నిలిచింది. వాణిజ్యంతో విశ్వాసాన్ని పెంపొందించడం, శాస్త్ర పరిజ్ఞానం పంచుకోవడం, సుస్థిర వ్యవసాయం కోసం పరస్పర సహకారానికి సమిట్ వారధిగా ఉంటుంది" అని వివరించారు.
రైతు భరోసాతో సాగు బలోపేతం
రాష్ట్రంలో అమలవుతున్న రైతు భరోసాతో సాగు బలోపేతం అవుతున్నదని మంత్రి తుమ్మల తెలిపారు. సబ్సిడీని జమ చేయడం ద్వారా రైతులు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నామని, ఇది పారదర్శకతను పెంచి రైతులను శక్తిమంతం చేస్తుందన్నారు. ఆఫ్రికా దేశాలు ఇలాంటి విధానాలను అమలు చేస్తే, నాణ్యమైన విత్తనాల వినియోగం పెరిగి ఉత్పాదకత, ఆహార భద్రత మెరుగుపడుతుందని సూచించారు.
ఆఫ్రికా విత్తన మార్కెట్ విలువ సుమారు 3.99 బిలియన్ డాలర్లుగా ఉందని, భారత్–ఆఫ్రికా భాగస్వామ్యం ద్వారా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇండియన్ చాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ , ఆఫ్రికన్ సీడ్ ట్రేడ్ అసోసియేషన్ సహా ఇతర భాగస్వామ్య సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 20కి పైగా ఆఫ్రీకా దేశాల డెలిగేట్లు, సీడ్ఇండస్ట్రీ ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.