- చేనేత సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- కార్మికుల కోసం శాశ్వత పథకాలు తీసుకొస్తున్నం
- చేనేత కళను ప్రపంచవ్యాప్తం చేస్తామని వెల్లడి
సికింద్రాబాద్, వెలుగు: చేనేత రంగం దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. చేనేత సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కళకు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం శాశ్వత పథకాలు తీసుకొస్తున్నదని చెప్పారు. బుధవారం చేనేత, జౌళీ శాఖ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల హాజరై చేనేత ప్రదర్శన ప్రారంభించి మాట్లాడారు. ‘‘చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేతన్నల అంకితభావం, సృజనాత్మకత దేశానికే గర్వకారణం. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు కొనాలి. దీంతో నేతన్నలకు ఉపాధి దొరుకుతుంది. ప్రతి చేనేత కళాకారుడికి ప్రభుత్వ సహకారం ఉంటది. వారి జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత ప్రభుత్వానిదే. ప్రపంచంతో పోటీపడే పద్ధతులు నేర్చుకుంటూ ముందుకెళ్లాలి. చేయూత పథకం కింద 2024 – 25 బడ్జెట్ లో 36,133 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చేందుకు రూ.90 కోట్లు కేటాయించినం’’అని తుమ్మల అన్నారు.
బడ్జెట్లో రూ.15 కోట్లు కేటాయించినం
నేతన్న బీమా ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 36,777 మంది చేనేత, అనుబంధ కార్మికులకు లబ్ధి చేకూర్చేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.15 కోట్లు కేటాయించామని మంత్రి తుమ్మల తెలిపారు. ‘‘రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ నెలకోల్పేందుకు నిర్ణయం తీసుకున్నం. నేతన్న బీమా స్కీమ్ కింద ఇప్పటి దాకా 124 డెత్ క్లెయిమ్స్ సెటిల్ చేశాం. ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున రూ.6.20 కోట్లు వారి నామినీ ఖాతాల్లో జమ చేశాం’’అని తుమ్మల అన్నారు.
తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుల కింద 32 మంది నేత, డిజైనర్ లకు ప్రతిభాపత్రం, జ్ఞాపిక, శాలువాతో మంత్రి సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.25 వేల నగదు పురస్కారం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత జౌళీ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్ విజయ రెడ్డి, మాజీ డీఐజీ తేజ్ దీప్ కౌర్, రాష్ట్ర పద్మశాలి సంఘ అధ్యక్షులు కందకట్ల స్వామి, మండల శ్రీరాములు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
