
ఖమ్మం టౌన్, వెలుగు : రాజకీయాలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఆదివారం ఖమ్మం సిటీలోని 57వ డివిజన్ రమణ గుట్ట ప్రాంతంలో రూ.2.36 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 57వ డివిజన్ ప్రాంతంలో పేదలు ఎక్కువ ఉన్నారని స్థానిక నాయకులు కోరగా, ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను అధికంగా ఇక్కడ కేటాయించినట్లు తెలిపారు.
ఖమ్మం నగరంలో 2 వేల ఇండ్లు మంజూరు చేస్తే కేవలం 57వ డివిజన్ పరిధిలో 200 కు పైగా కేటాయించామన్నారు. అర్హులందరికీ విడతల వారీగా ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. లబ్ధిదారులు ఇండ్లు త్వరగా నిర్మించుకుంటే, బిల్లులు కూడా వెంటనే వస్తాయన్నారు. సీసీ రోడ్డు, డ్రైయిన్ల నిర్మాణం నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, మున్సిపల్ ఇంజినీరింగ్ ఖమ్మం డివిజన్ కార్య నిర్వాహక ఇంజినీర్ వి. రంజిత్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పలు కుటుంబాలకు పరామర్శ
తల్లాడ : తల్లాడ నారాయణపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ వేమిరెడ్డి రామ తులిశమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా మంత్రి తుమ్మల ఆ కుటంబాన్ని ఇంటికి వెళ్లి పరామర్శించారు. రామ తులిశమ్మ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె భర్త తల్లాడ మాజీ సర్పంచ్ వేమిరెడ్డి కృష్ణారెడ్డితో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రి వెంట కలకొడిమ, గంగదేవి పాడు సొసైటీ చైర్మన్లు దిరిశాల నరసింహారావు, తూము వీరభద్రం, నాయకులు రాయల రాము, పొట్టేటి జనార్దన్ రెడ్డి, గొడుగునూరి శ్రీనివాస్ రెడ్డి, రామప్పారావు, మూకర ప్రసాద్, బ్రహ్మారెడ్డి ఉన్నారు.
మధిర : మధిర మండల పరిధిలోని సిరిపురంలో ఇటీవల మృతి చెందిన తుమ్మల ప్రధాన అనుచరుడు వెలగపూడి శివరాం ప్రసాద్ కుటుంబాన్ని ఆయన స్వగృహంలో ఆదివారం మంత్రి తుమ్మల పరామర్శించారు. శివరాం ప్రసాద్ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన రాజకీయ జీవితంలో తన వెంట ప్రధానంగా నడిచిన వ్యక్తిగా వెలగపూడి శివరాం ప్రసాద్ ను అని మంత్రి గుర్తుచేశారు. మంత్రి వెంట డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొండితోక సుధాకర్, చెరుకూరి నాగార్జున, టీడీపీ నాయకుడు వాసిరెడ్డి రామనాధం ఉన్నారు.