
- రాష్ట్ర స్థాయి సమ్మేళనంలో
- మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
అశ్వారావుపేట, వెలుగు: ఆయిల్ పామ్ పంట సాగు చేస్తే.. ఆ రైతును సమాజంలో తలెత్తుకొని గర్వంగా బతికేలా చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామ శివారులో మద్దిని కోటయ్య వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ రైతుల రాష్ట్ర స్థాయి సమ్మేళనం నిర్వహించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ దేశంలో 13 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తుంటే, తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల ఎకరాల్లో సాగవుతోందన్నారు. తెలంగాణలో 10 నుంచి 15 లక్షల ఎకరాలు సాగు చేసేందుకు అనువుగా ఉందన్నారు. 40 ఏండ్ల కింద ఏపీతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రమే సాగు చేసుకునేందుకు పర్మిషన్ ఉండేదని, దీనిని ఇప్పుడు 31 జిల్లాలకు పెంచామని తెలిపారు. లేటెస్ట్ మెషినరీతో దమ్మపేట మండలం అప్పారావుపేటలో ఫ్యాక్టరీని నిర్మించామని, ఈ ఫ్యాక్టరీ ఆధారంగానే దేశమంతా ప్రైవేట్ ఫ్యాక్టరీలు రేటు ఇచ్చే పరిస్థితి తీసుకువచ్చామన్నారు. సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీని రాష్ట్రంలోని పంట మొత్తం తీసుకునేలా డిజైన్ చేశామన్నారు.
ఈ ఫ్యాక్టరీని త్వరలో సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలతో ఏర్పడిన బాకీలు కట్టడానికే డబ్బులు సరిపోతున్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని తెలిపారు. వివిధ దేశాల మధ్య యుద్ధాలతో రష్యా, జర్మనీ నుంచి యూరియా రాలేదని, చైనా ఒక కట్ట యూరియా ఇవ్వలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకపల్లి వీరభద్రరావు, ఆయిల్ పామ్ రైతు రాష్ట్ర అధ్యక్షుడు అలపాటి రామచంద్ర ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, బండి భాస్కర్, పైడి వెంకటేశ్వరరావు, చెన్నకేశవరావు, నిర్మల పుల్లారావు, బండి పుల్లారావు, కోటగిరి సీతారామస్వామి పాల్గొన్నారు.