యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం టౌన్, వెలుగు:  వానాకాలం పంట సాగుకు అవసరమైన యూరియా రైతులకు చేరేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.  మంత్రి తుమ్మల సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో కలిసి సోమవారం యూరియా, ఎరువుల లభ్యతపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  వీసీలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీసీ ప్రసాద్ రావు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ..  రాబోయే 15 రోజుల పాటు యూరియా సరఫరాపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.  మండల స్థాయిలో స్టాక్ వివరాలు మానిటరింగ్ చేయాలన్నారు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి యూరియా తరలించాలన్నారు.  ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ సక్రమంగా అమ్మకాలు జరిగేలా చూడాలన్నారు.   ప్రస్తుతం ఉన్న స్టాక్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.  

యూరియా సరఫరా కు చేపట్టిన చర్యలు రైతులకు మీడియా ద్వారా తెలియజేయాలన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ..  జిల్లాలో ఎక్కడా యూరియా కోసం రైతులు ఇబ్బంది పడరాదని, ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ అవసరం ఉన్న మేరకు యూరియా సరఫరాకు వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలాల్లో ఎక్కడైనా కొరత ఉంటే తనకు తెలియజేయాలన్నారు. 

వెంటనే ఇతర ప్రాంతాల నుంచి స్టాక్ తెప్పిస్తామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా సహకార అధికారి గంగాధర్, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, జిల్లా మార్క్ ఫెడ్ అధికారిణి  సునీత, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు,  అధికారులు, తదితరులు పాల్గొన్నారు.