రైతులు లాభసాటి పంటలను సాగు చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

రైతులు లాభసాటి పంటలను సాగు చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం టౌన్, వెలుగు : లాభసాటి పంటలు సాగు చేస్తూ రైతులు అధిక ఆదాయం పొందాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. సోమవారం ఖమ్మం నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి శంకుస్థాపన చేశారు. 

రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలో రూ.3 కోట్లతో చేపట్టిన వెనకబడిన తరగతుల బాలుర వసతి గృహ నిర్మాణ పనులు, రూ.30 లక్షలతో పశు వైద్యశాల భవనం, ప్రహరీ గోడ నిర్మాణ పనులు, ఖమ్మం నగర పాలక సంస్థ 9వ డివిజన్ పరిధిలో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.66 లక్షలతో చేపట్టిన సీపీరోడ్డు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వి.వెంకటాయపాలెం పీఏసీఎస్ వద్ద  ఏర్పాటు చేసిన సీఎస్ సీ కేంద్రాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు వరి కాకుండా ఆయిల్ పామ్, వక్క, జాజి, జాజి పత్రి వంటి లాభదాయక పంటలు సాగు చేయాలని చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ క్రింద ఉన్న రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి పనులు శాశ్వతంగా నిలిచిపోయేలా పూర్తి చేయాలని, ఎక్కడా నాణ్యత లోపం రావొద్దని అధికారులకు చెప్పారు.  

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి..

అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో మున్నేరు రిటైనింగ్ వాల్, కేబుల్ బ్రిడ్జి, ఖిలా రోప్ వే పనుల పురోగతిపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా మున్నేరు వాగుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టామన్నారు. రూ.690 కోట్లతో మున్నేరుకు ఇరువైపులా 17 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఇప్పటివరకు 6.4 కిలో మీటర్ల మేర పనులు పూర్తయినట్లు వివరించారు. మిగులు భూసేకరణ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. 

కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు నిర్ణీత సమయంలోగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. 180 కోట్లతో చేపడుతున్న పనులు ఇప్పటివరకు 53 శాతం పూర్తయినట్లు తెలిపారు. పర్యాటకుల సౌకర్యార్థం ఖమ్మం ఖిలాపై నిర్మిస్తున్న రోప్ వే కు భూసేకరణ పూర్తయినట్లు తెలిపారు. రూ.29 కోట్లతో చేపడుతున్న రోప్ వే సివిల్ పనులు నెలాఖరుకు ప్రారంభించి, వచ్చే జూలై నాటికి అగ్రిమెంట్ ప్రకారం మొత్తం పూర్తి చేయాలన్నారు. 

ఖిలాకు రోడ్ కనెక్టివిటీ విస్తరణ కు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, డీఆర్డీవో సన్యాసయ్య, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకోబ్, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి జి.జ్యోతి, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ పురందర్, ఖమ్మం ఆర్డీవో నరసింహా రావు, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.