యూరియా కొని ఇళ్లలో నిల్వ పెట్టుకోవద్దు: రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచన

యూరియా కొని ఇళ్లలో నిల్వ పెట్టుకోవద్దు: రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచన

హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత వేళ రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక సూచన చేశారు. రైతులు యూరియా కొని ఇళ్లలో నిల్వ పెట్టుకోవద్దని.. ఇలా చేస్తే కృతిమ కొరత ఏర్పడుతుందన్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని.. యూరియా సరిపడా రాష్ట్రానికి వస్తుందన్నారు మంత్రి తుమ్మల. 

తర్వాత దొరుకుతుందో లేదో అనే భయంతో ముందే కొని ఇళ్లలో నిల్వ పెట్టుకోవడం ద్వారా కృతిమ కొరత ఏర్పడుతుందని అన్నారు.  రాజకీయ స్వార్థంతో కొందరు చేస్తోన్న రెచ్చగొట్టే ప్రయత్నాల గురించి రైతులు ఆలోచన చేయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రైతాంగానికి భరోసాగా నిలుస్తుందని ధైర్యం చెప్పారు.

యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. మంత్రి ఆదేశాల మేరకు క్యూ లైన్స్, తోపులాటలు లేకుండా యూరియా పంపిణీకి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ‎కి ఏర్పాట్లు చేశారు.

 రైతు వేదికల వద్ద రైతులకు టోకెన్లు జారీ చేసి క్యూ లైన్లు లేకుండా యూరియా పంపిణీ చేస్తున్నారు. మంత్రి తుమ్మల ఆదేశాలతో యూరియా పంపిణీపై వ్యవసాయ శాఖ కార్యాలయంలో పర్యవేక్షణ చేస్తున్నారు అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి. యూరియా పంపిణీ సజావుగా సాగుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.