
- ఖమ్మంలో వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి ప్రతిపాదన చేసిన మంత్రి
ఖమ్మం టౌన్, వెలుగు : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఖమ్మంలో వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదన చేశారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం టీటీడీ బృందం తుమ్మలతో భేటీ అయ్యింది. ఆలయ నిర్మాణం కోసం ఖమ్మం నియోజకవర్గంలోని అల్లిపురం, రఘునాథ పాలెం మండలంలో స్థల పరిశీలన చేశారు. ఆలయంతో పాటు భారీ కల్యాణ మండపం నిర్మాణానికి ఆలయ స్థపతి రవి కాంత్, టీటీడీ ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి, ఈఈ సురేందర్ నాథ్‌రెడ్డి, డీఈఈ నాగభూషణం, ఎలక్ట్రికల్ ఈఈ రవి శంకర్ రెడ్డి, ఏఈ జగన్మోహన్ రావు మంత్రితో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం నాలుగు దశాబ్దాలుగా భద్రాద్రిసీతారామ చంద్రస్వామి వారి ఆశీస్సులతో ప్రజా సేవ చేస్తున్నట్లు తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్, ఎన్టీఆర్ వరద కాల్వ, భక్తరామదాసు, మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లతో భూములు సస్యశ్యామలం కానున్నాయని తెలిపారు. జాతీయ రహదారులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతిబాట వేయనుందన్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణ తో లక్షలాది రైతుల కుటుంబాల్లో సంతోషం నింపేలా బాటలు వేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం నగరానికి మున్నేరుపై హై లెవల్ బ్రిడ్జిలతో ప్రగతి బాటలు పడనున్నట్లు తెలిపారు. ఖమ్మం సిటీని ఐకాన్ గా భవిష్యత్ తరాలకు గుంర్తుండేలా టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు.