
- బీసీలకు న్యాయం చేయాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడి
- జిత్నే అబాది.. ఉత్నే ఇస్సేదారి: పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: తమ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిన కులగణన సర్వే చరిత్రాత్మకమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ నివేదికను ఉపయోగించుకుని సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని తెలిపారు. బీసీలకు న్యాయం చేయాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. సర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా విజయవంతంగా పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే నివేదికను మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని కేబినెట్ సబ్‌కమిటీకి ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఆదివారం అందజేశారు. దీనిపై కమిటీలో చర్చించారు. అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజనర్సింహతో కలిసి ఉత్తమ్ సెక్రటేరియెట్‌లో మీడియాతో మాట్లాడారు.
రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టామని ఆయన వెల్లడించారు. ఈ రిపోర్టుపై ఈ నెల 4న కేబినెట్ మీటింగ్ లో చర్చిస్తామని, అదే రోజు అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు. ‘‘స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి మన దేశంలో జనగణన జరుగుతున్నది. కానీ అసలైన పేదలను గుర్తించేందుకు కులగణన మాత్రం జరగలేదు. బలహీనవర్గాల అభ్యున్నతి కోసమే కులగణన చేపట్టాం. సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ డేటాను ఉపయోగించుకుంటాం” అని పేర్కొన్నారు. సర్వేపై కొందరు తప్పుడు ప్రచారాలు చేశారని, హైకోర్టులో పిల్‌లు దాఖలు చేసి అడ్డుకోవాలని చూశారని.. అయినా తాము విజయవంతంగా పూర్తి చేశామన్నారు.
జనాభా ప్రకారం వాటా దక్కాలి: పొన్నం
కులగణన సర్వేకు కొందరు అనేక రకాలుగా అడ్డం తగిలారని, అయినా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘ఈ రోజు కులగణన సర్వే నివేదికను ప్రభుత్వానికి ప్లానింగ్ డిపార్ట్ మెంట్ అందజేసింది. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు’ అని పేర్కొన్నారు. ‘‘బలహీన వర్గాల శాఖ మంత్రిగా కులగణన కోసం పోయినేడాది ఫిబ్రవరి 16న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాను. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకున్నాం.
బీసీ కమిషన్ దగ్గర ఇన్ఫాస్ట్రక్చర్ ఉండదని, సర్వే బాధ్యతలను ప్లానింగ్ డిపార్ట్ మెంట్ కు అప్పగించాం. రాహుల్ గాంధీ చెప్పినట్టు జనాభాలో ఎవరెంతుంటే వారికంత (జిత్నే అబాది.. ఉత్నే ఇస్సేదారి) దక్కాలనే సంకల్పంతో సర్వే చేపట్టాం. ఈ సర్వేతో దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ నిలిచింది” అని అన్నారు. బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించేందుకు, సంక్షేమ పథకాలు అందించేందుకు ఈ నివేదికను ఉపయోగించుకుంటామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఫలాలు అందిచడంపై అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు.