త్వరలోనే కాళేశ్వరంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తాం: ఉత్తమ్ కుమార్

త్వరలోనే కాళేశ్వరంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తాం: ఉత్తమ్ కుమార్

కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజాధనం వృధా కావడంతో పాటు నష్టం కూడా జరిగిందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 29వ తేదీ శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు మంత్రులు మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌రెడ్డి, శ్రీధర్‌‌‌‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌‌, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌‌‌ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డిలు ప్రత్యేక హెలిక్యాప్టర్ లో మేడిగడ్డకు చేరుకుని సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. "కాళేశ్వరం కంటే చేవెళ్ల ప్రాణహితకే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తోంది. 16 లక్షల ఎకరాల టార్గెట్ తో రూ.38వేల కోట్లతో ప్రాణహిత చేపట్టాం. మహారాష్ట్రలో కొద్దిపాటి ముంపుతో ప్రాణహిత పూర్తయ్యేదని.. అయితే, సడెన్ గా ప్లాన్, ప్లేస్ మార్చేసి మేడిగడ్డ కట్టారు.రూ.38వేల కోట్ల ప్రాజెక్టును రూ.80వేల కోట్లతో మొదలు పెట్టారు. మేడిగడ్డ పిల్లర్లు 5 ఫీట్ల లోతుకు కుంగిపోయాయి.దీనిపై గత ప్రభుత్వం విచారణ చేపట్టకపోవడం విచారకరం.  అన్నారం బ్యారేజికి కూడా నష్టం జరిగింది. పిల్లర్లు కుంగడంపై అప్పటి ముఖ్యంత్రి కేసీఆర్ నోరు మెదపలేదు.  రూ.80వేల కోట్ల నుంచి ప్రాజెక్టు కాస్ట్ లక్షనర కోట్లకు చేరింది. ఇప్పటి వరకు రూ.95వేల కోట్లు ఖర్చు అయ్యింది. ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు మాత్రమే.  కాళేశ్వరంతో వడ్డీల భారం తప్పితే ఎలాంటి ప్రయోజనం లేదు. త్వరలోనే కాళేశ్వరంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తాం" అని తెలిపారు.