
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఇంకా ప్రమాదంలోనే ఉన్నయ్
- కల్వకుర్తి నుంచి ఎప్పుడు నీళ్లు లిఫ్ట్ చెయ్యాలో మాకు తెలుసని వెల్లడి
హైదరాబాద్, వెలుగు:పదేండ్లలో చేసిన తప్పులు, దుర్మార్గాలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. మేడిగడ్డ, కల్వకుర్తి అంటూ ఇప్పటికీ రైతులను బీఆర్ఎస్ నేతలు మోసం చెయ్యాలని చూస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ అసమర్థత, నిర్లక్ష్యం, నిర్వాకం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని అన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయని, సీకెంట్ పైల్స్ టెక్నాలజీతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించడాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తప్పు బట్టిందని చెప్పారు.
అవి ఇప్పుడు పనికిరాకుండా ఉన్నాయని, వాటినుంచి నీళ్లను ఎత్తిపోయాలా? అని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీళ్లను ఎత్తిపోయాలన్న హరీశ్‌రావు వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. “గతంలో మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, అక్కణ్నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసిన 160 టీఎంసీల్లో దాదాపు 57 టీఎంసీల నీళ్లు మళ్లీ గేట్లు ఎత్తి సముద్రానికి పంపించి ప్రజాధనాన్ని గోదాట్లో పోసిన విషయం మరిచిపోయారా? ఎన్డీఎస్ఏ సలహాలు, సూచనల మేరకు మా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులపై తగిన నిర్ణయం తీసుకుంటుంది.
హరీశ్‌రావు కల్లబొల్లి మాటలు నమ్మాల్సిన అవసరం మాకు లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన ప్రకారం మేడిగడ్డ దగ్గరి కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్లకు నీటిని లిఫ్ట్ చేయాలి. తప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో, తప్పుడు డిజైన్లతో ఆ 3 బ్యారేజీలను నిర్మించిన దుర్మార్గం గత ప్రభుత్వానిది. ఆ మూడు బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్డీఎస్ఏ హెచ్చరించింది. అయినా సరే, కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని హరీశ్‌రావు పదే పదే మాట్లాడటం వెనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర తప్ప రైతులకు మేలు చేసే మంచితనం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్కరకు రాకుండా నిర్మించిన వారి అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాలు వల్లించడం తప్ప, ప్రజా ప్రయోజనాలను బీఆర్‌ఎస్ లీడర్లు మరిచిపోయారు” అని వ్యాఖ్యానించారు.
తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటం
కల్వకుర్తి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎప్పడు ఎత్తిపోయాలో తమకు తెలుసని, తమకు హరీశ్ నీతులు చెప్పాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. కల్వకుర్తి పంపులు ఏటా జులై చివరిలో లేదా ఆగస్టు ఒకటో తేదీన స్విచ్ ఆన్ చేసి వానాకాలం పంటలకు నీళ్లు అందిస్తారని, ఈసారి కూడా అదే విధానం అమలవుతుందని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని సూచించారు. గత బీఆర్ఎస్ హయాంలో 2019లో ఆగస్టు ఒకటిన, 2020లో ఆగస్టు 31, 2021లో ఆగస్టు 15, 2022లో జులై 13, 2023లో ఆగస్టు 6న కల్వకుర్తి లిఫ్ట్ లు ఆన్ చేశారని గుర్తు చేశారు.
నిరుడు జులై 27న స్విచాన్ చేశామన్నారు. “రైతుల అవసరాలు, నీటి నిల్వల ఆధారంగా సాగునీటి ప్రాజెక్టుల నీటిని ఎప్పుడు విడుదల చేయాలి. ఎంత ఆయకట్టుకు ఇవ్వాలి.. ఈసారి ఎంత సమర్థంగా వాడుకోవాలనేది ప్రభుత్వం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది. ఈనెల 11న జరిగే స్టేట్ లెవల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్(ఎస్‌సీఐడబ్ల్యూఏఎం ) మీటింగ్‌లో తీసుకునే నిర్ణయాల ఆధారంగా అన్ని సాగునీటి ప్రాజెక్టులు, ఆయకట్టు ప్రణాళిక సిద్ధమవుతుంది” అని వివరించారు.
బీఆర్ఎస్ కుట్రలు బయటపడ్డయ్
కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించడం వెనుక అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కుట్రలన్నీ ఇప్పటికే బయటపడ్డాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. “వాళ్ల హయాంలోనే పోతిరెడ్డిపాడు కెపాసిటీ రెండింతలకు మించి 88 వేల క్యూసెక్కులకు పెంచుకున్నారు. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్, ముచ్చుమర్రి నుంచి రోజుకు దాదాపు 8 నుంచి 10 టీఎంసీల నీటిని ఏపీ మళ్లించుకునే కుట్రలకు బీఆర్ఎస్ దొంగచాటుగా సహకరించింది. 2004 నుంచి 2014 వరకు ఏపీ అక్రమంగా 770 టీఎంసీల కృష్ణా జలాలు తీసుకుపోతే.. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలనలో ఏపీ ప్రభుత్వం ఏకంగా 1,225 టీఎంసీల నీళ్లు అక్రమంగా తీసుకుపోయినట్లు రికార్డులున్నాయి.
తెలంగాణ ప్రయోజనాలను బీఆర్ఎస్ పాలకులు ఎలా తాకట్టుపెట్టారో తెలియజేసేందుకు ఇంతకు మించిన సాక్ష్యం ఏముంటుంది? నిరంతరం రాష్ట్రంలో రైతులను మోసం చేయాలని, రైతులను ఆందోళనకు గురి చేయాలని బీఆర్ఎస్ కుట్రలకు పాల్పడుతున్నది. కుట్రపూరితమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. అబద్ధాలను గోబెల్స్ కు మించి ప్రచారం చేయడం మాజీ మంత్రి హరీశ్ రావుకు అలవాటైపోయింది” అని ఫైర్ అయ్యారు. పంట వేసేటప్పుడు రైతులను ఆదుకునే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానిదని, ప్రతి పంట సీజన్‌లో రైతులను ఆందోళనకు గురి చేసి, గందరగోళపరచాలనే దుర్బుద్ధి బీఆర్ఎస్ నేతలది అని చురకలంటించారు.
రికార్డు స్థాయిలో వరి పంట
నిరుడు వానాకాలంతోపాటు ఇటీవల యాసంగిలో దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రైతులు రికార్డుస్థాయిలో వరి పంట సాగు చేశారని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఆ విషయాన్ని మరిచిపోయి హరీశ్‌రావు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, యాసంగి సీజన్‌కు ముందు కూడా బీఆర్ఎస్ ఇలాంటి అబద్ధాలు మాట్లాడిందని మండిపడ్డారు. “గత వానాకాలంలో రాష్ట్రంలోని రైతులు 66.7 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసి 153.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారు. యాసంగిలో 60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే.. 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించారు.
దేశ చరిత్రలోనే ఒకే ఏడాదిలో 283 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన రికార్డు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైంది. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిస్తే బీఆర్ఎస్లీడర్లు ఓర్వడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ రైతు పక్షపాతిగానే ఉంటుంది. వానాకాలం పంటలకు పెట్టుబడి సాయంగా రైతులకు అందించే ఆలోచన చేశాం. కేవలం 9 రోజుల రికార్డు వేగంతో రూ.9 వేల కోట్లు రైతు భరోసా పంపిణీ చేసిన ఘనత మాది.
గతంలో బీఆర్ఎస్ ఎకరానికి రూ.5 వేల సాయం అందిస్తే.. ఎకరానికి మా ప్రభుత్వం రూ.6 వేల సాయం అందించింది. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఏకకాలంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేసింది. ఇప్పటికైనా హరీశ్‌రావు అబద్ధాలు మాట్లాడటం మానుకోవాలి” అని ఉత్తమ్ హితవు పలికారు.