కరువుతో రైతు నష్టపోతే కేసీఆర్ రూపాయి ఇవ్వలే : ఉత్తమ్ కుమార్ రెడ్డి

కరువుతో రైతు నష్టపోతే కేసీఆర్ రూపాయి ఇవ్వలే : ఉత్తమ్ కుమార్ రెడ్డి

తన హయాంలో కరువు కారణంగా పంట నష్టపోతే రూపాయి కూడా పరిహారం అందించని మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి విమర్శించారు. ఇరిగేషన్ సెక్టార్ ను నాశనం చేసేందే కేసీఆర్ అని అన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డ ఆయన నీటిపారుదలపై మాట్లాడడాన్ని మంత్రి తప్పు పట్టారు. కేసీఆర్ జగన్ కలిసి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ హయాంలో తెలంగాణకు ఎక్కువ ద్రోహం జరిగిందని అన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

నిన్న కేసీఆర్ పంటపొలాల విజిట్ సందర్భంగా మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమేనని అన్నారు. కేసీఆర్ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారన్నారు. పార్టీ మిగలదన్న భయం ఆయనలో మొదలైందన్నారు. పొంకనాలకు పోయి జాతీయ పార్టీ అన్నారని చెప్పారు. ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగదని, కేసీఆర్, ఆయన కుటుంబం తప్ప ఎవరూ ఉండరని అన్నారు. కేసీఆర్ జనరేటర్ వెంట బెట్టుకొని వెళ్లి మీటింగ్ పెట్టారని, టెక్నికల్ ప్రాబ్లం వస్తే కరెంటు పోయిందని అబద్ధం చెప్పారని అన్నారు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోవడం లేదని చెప్పారు. రాష్ట్రంలో పోలీసు శాఖను మిస్ యూజ్ చేసిన ఘనుడు కేసీఆర్ అని, ఇప్పుడాయన పోలీసులు న్యూట్రల్ గా ఉండాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 

దేశంలో ఎన్నో రాజకీయ  పార్టీలున్నాయని, ఇంత తొందరగా ఏ పార్టీ పతనం కాలేదని చెప్పారు. బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల తర్వాత ఉండదని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని చెప్పారు.  నిన్న సూర్యాపేట విజిట్ లో నిన్న మాజీ సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. గత ప్రభుత్వం ఎన్టీపీసీ కి సహకరించి ఉంటే 4 వేల మెగావాట్ల ఉత్పత్తి ఎలాంటి ఖర్చు లేకుండా రాష్ట్రానికి ఫ్రీగా వచ్చేదని చెప్పారు. బీ ఆర్ ఎస్ హయాంలో మొదలుపెట్టిన ఏ విద్యుత్ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు.  దేశంలో పంట భీమా లేని రాష్ట్రo తెలంగాణ మాత్రమేనని, ఇందుకు కేసీఆర్ సిగ్గుపడాలని, రైతులకు బేషరతులగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

ALSO READ :- కాళేశ్వరం లోపాలపై ఎల్అండ్ టీ సంస్థనే అడగండి : శ్రీనివాస్ గౌడ్