- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- నూతనంగా గెలిచిన సర్పంచులకు సన్మానం
కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు ప్రజలతో కలిసి పనిచేసి మంచి పేరు సంపాదించి చరిత్రలో నిలవాలని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయ్స్ శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని డేగ బాబు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ పాలనలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, అహంకారానికి తావివ్వకుండా ప్రజలతో కలిసిమెలసి పనిచేయాలని ఆయన సూచించారు. కోదాడ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మార్చాలని, అంతర్గత విభేదాలు లేకుండా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
మోతె, మునగాల, నడిగూడెం మండలాల్లో ఎత్తిపోతల పథకాల ద్వారా మరో 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. సన్న బియ్యం పథకం తెలంగాణకే గర్వకారణమని, 3.20 కోట్ల మందికి 80 శాతం సన్న బియ్యం అందిస్తున్నామని వివరించారు. నూతనంగా గెలిచిన సర్పంచ్‌ల గ్రామాలకు ఒక్కో గ్రామానికి 30 ఇండ్లు మంజూరు చేసే ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో కోదాడను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రచార కమిటీ కో-కన్వీనర్ కేఎల్ఎన్ ప్రసాద్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
