ఎన్డీఎస్​ఏ రిపోర్ట్​ ప్రకారమే ముందుకు..కాళేశ్వరం బ్యారేజీల వద్ద టెస్టులు చేయించాలని మంత్రి ఉత్తమ్​ ఆదేశం

ఎన్డీఎస్​ఏ రిపోర్ట్​ ప్రకారమే ముందుకు..కాళేశ్వరం బ్యారేజీల వద్ద టెస్టులు చేయించాలని మంత్రి ఉత్తమ్​ ఆదేశం
  • అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​
  • డ్రిల్లింగ్, బ్లాస్టింగ్​ ద్వారాఎస్​ఎల్​బీసీ పనులుచేపట్టేందుకు నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరంలోని మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద త్వరగా జియోటెక్నికల్, జియోఫిజికల్​ఇన్వెస్టిగేషన్లు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి సూచించారు. బ్యారేజీలపై నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్​ఏ) తుది నివేదికలో పేర్కొ న్న అంశాల ఆధారంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. మంగళవారం మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు.

ఎన్​డీఎస్​ఏ రిపోర్ట్​, ఎస్​ఎల్​బీసీ టన్నెల్​ పనులు, తుమ్మిడిహెట్టి, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎన్డీఎస్​ఏ రిపోర్టు ప్రకారమే ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించినట్టు తెలిసింది. అయితే, ఇప్పటికే బ్యారేజీల వద్ద జియోటెక్నికల్​ ఇన్వెస్టిగేషన్స్​ కోసం సెంట్రల్​ వాటర్​, పవర్​ రీసెర్చ్​ స్టేషన్​ (సీడబ్ల్యూపీఆర్ఎస్) కు లేఖ రాసినట్టు అధికారులు చెప్పారు.

ఇక, మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటిని ఎత్తిపోసుకునే అవకాశం లేకపోవడంతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై ఏం చేస్తే బాగుంటుందని మంత్రి ఉత్తమ్​ అడిగినట్టు తెలిసింది. బ్యారేజీ ఫీజిబిలిటీకి సంబంధించి స్టడీస్​ చేయాలని సూచిం చినట్టు సమాచారం. తుమ్మిడిహెట్టి బ్యారేజీతో పాటు ప్రత్యామ్నాయాల గురించి వివరించినట్టు తెలిసింది. షెడ్యూల్​లో లేని పనులు చేసిన వాటికి ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదని నిర్మాణ సంస్థలు చెప్పడంతో.. ఆయా బిల్లుల చెల్లింపులపైనా దృష్టి పెట్టాలని చెప్పినట్టు సమాచారం.

ఆ పనులకు రూ.5 కోట్ల వరకు బిల్లులు పెండింగ్​ ఉన్నట్టు అధికారులు చెప్పారు. కాగా, ఎస్​ఎల్​బీసీ ఇన్​లెట్​ టన్నెల్​ పనులు టన్నెల్​ బోరింగ్​ మెషీన్​ (టీబీఎం)తో సాధ్యమయ్యే అవకాశం లేకపోవడంతో.. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్​తో చేయించాలని సూచించినట్టు తెలిసింది. టెక్నికల్​ సబ్​ కమిటీ సూచనల మేరకు రెస్క్యూ ఆపరేషన్​ను చేపట్టాలని మంత్రి ఉత్తమ్​ సూచించినట్టు సమాచారం. మరోవైపు బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి యాక్షన్​ ప్లాన్​ సిద్ధం చేయాల్సిందిగా నిర్మాణ సంస్థలైన ఎల్​ అండ్​ టీ, ఆఫ్కాన్స్, నవయుగకు ఇరిగేషన్​ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించినట్టు తెలిసింది. 

త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి: గుత్తా సుఖేందర్​ రెడ్డి

ఇరిగేషన్​ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నదని శాసనమండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి చెప్పారు. ధర్మారెడ్డిపల్లి కెనాల్, పిలాయిపల్లి కెనాల్, బునాదిగాని కెనాల్స్​పై మంగళవారం జలసౌధలో మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడారు. మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పనులను త్వరగా పూర్తి చేసేలా నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు.  

పిలాయిపల్లి, ధర్మారెడ్డి పల్లి, బునాదిగాని కెనాల్స్ పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని, చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటూ వర్క్స్ పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ , బీర్ల ఐలయ్య , మందుల సామేలు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.