ఘనంగా జాన్ పహాడ్ దర్గా ఉర్సు గంధోత్సవం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఘనంగా జాన్ పహాడ్ దర్గా ఉర్సు గంధోత్సవం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • గంధం ఊరేగింపులో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

పాలకవీడు, వెలుగు: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో జాన్ పహాడ్ దర్గా వద్ద శుక్రవారం ముస్లిం సంప్రదాయ పద్ధతిలో ఉర్సు ఉత్సవం జరిగింది. వక్స్ బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నుంచి తెచ్చిన గంధంను  హజారి జానీ తీసుకువచ్చిన గంధంను చందల్ ఖానా లో ఉంచారు.  వాటిని ప్రత్యేకంగా అలంకరించిన గుర్రం పై ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో గంధం బిందెలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌ ఎత్తుకొని చందల్ ఖానాలో ప్రత్యేక ప్రార్థనలు  నిర్వహించారు. చందల్ ఖానాలో ఉంచిన గంధంను ముస్లింలు కల్మటి తండా, జాన్ పహాడ్, చెరువు తండా గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు.  వేలాది మంది భక్తులు గంధం ఊరేగింపులో  పాల్గొన్నారు.

అక్కడి నుంచి దర్గా వద్దకు తీసుకువచ్చిన హజ్రత్ సయ్యద్ మోహినిద్దీన్ షా, జాన్ పాక్ షాహిద్ రహమతుల్లా సమాధుల పైకి ఎక్కించారు.  గంధం ఎక్కించేటప్పుడు తోపులాట జరగకుండా భక్తులను పోలీసులు బయటకు పంపారు. ఈ ఉర్సు ఉత్సవానికి  రాష్ట్రం నుంచే కాక ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. భద్రత ఏర్పాట్లను ఎస్పీ నరసింహ స్వయంగా వచ్చి పర్యవేక్షించారు.  దర్గా పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉర్సు ఉత్సవం ప్రశాంతంగా జరిగింది.  వేలాదిగా వచ్చే భక్తుల కోసం మిర్యాలగూడ కోదాడ ఆర్టీసీ డిపో వారు నేరేడుచర్ల దామరచర్ల మీదుగా దర్గా వద్దకు వచ్చేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.  

వైద్య అధికారులు ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి భక్తులకు వైద్య సేవలు అందించారు. ఉర్సు సందర్భంగా రెవెన్యూ శాఖ,  వైద్యశాఖ ఎక్సైజ్ అగ్నిమాపక శాఖలతో పాటు పంచాయతీరాజ్ శాఖ ఆర్టీసీ ప్రత్యేక క్యాంపులు నిర్వహించి భక్తులకు సేవలు అందించారు.  డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎనిమిది ట్యాంకర్ల ద్వారా నిరంతరాయంగా నీటిని సరఫరా చేసింది. ఏఎస్పీ రవీందర్ రెడ్డి,  సీఐలు చరమందరాజు, దొంతి రెడ్డి రామకృష్ణారెడ్డి,  పాలకవీడు ఎస్సై కోటేష్ లతో పాటు నేరేడుచర్ల మఠంపల్లి గరిడేపల్లి హుజూర్‌‌నగర్‌‌ ఎస్సైలు పాలకవీడు తహసీల్దార్ కమలాకర్ ఎంపీడీవో లక్ష్మి 550 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.