మేడిగడ్డకు పూర్తి స్థాయి డయాఫ్రం వాల్ అవసరం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి

మేడిగడ్డకు పూర్తి స్థాయి డయాఫ్రం వాల్ అవసరం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
  •  నవంబర్ లేదా డిసెంబర్‌‌‌‌లో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ  
  • 2027 జూన్ నాటికి పూర్తి చేస్తాం
  • రాహుల్​ ప్రధాని కావాలని దేశం ఎదురుచూస్తోందని కామెంట్​ 

సూర్యాపేట/ నేరేడుచర్ల/హుజూర్‌‌‌‌నగర్, వెలుగు: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ పునాదులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించేందుకు ఒక చివరి నుంచి మరో చివరి వరకు డయాఫ్రం వాల్ నిర్మించాల్సి అవసరం రావచ్చని నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల దిగువన ఉన్న స్టిల్లింగ్ బేసిన్లను బలోపేతం చేసి మరింత పొడిగించాల్సిన అవసరం ఉందన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, గోదావరి జలాల వినియోగంపై కీలక వివరాలు వెల్లడించారు. మేడిగడ్డ పునాదుల కింద నీటి చొరబాటును నియంత్రించి, దీర్ఘకాలిక భద్రత కల్పించేందుకు డయాఫ్రం వాల్ ప్రతిపాదన పరిశీలనలో ఉందని చెప్పారు. ఐఐటీ బాంబే, అంతర్జాతీయ కన్సల్టెన్సీ ఏఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌వై ఇండియా పరీక్షల నివేదికలను అధ్యయనం చేసి నిపుణులు డిజైన్లను సిద్ధం చేస్తున్నారని తెలిపారు.

జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సూచించిన పరీక్షలన్నీ పూర్తయ్యాయని, మరో రెండు మూడు వారాల్లో తుది డిజైన్ నివేదిక రానుందని పేర్కొన్నారు. నవంబర్ లేదా డిసెంబర్‌‌‌‌లో పునరుద్ధరణ పనులు ప్రారంభించి 2027 జూన్ నాటికి పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దెబ్బతిన్న బ్యారేజీలకు మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తేవడం సాంకేతికంగా క్లిష్టమైనప్పటికీ, తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి కావడం ఖాయమని, ఆయనను ఆ పదవిలో చూసేందుకు దేశమంతా ఎదురుచూస్తోందని మంత్రి ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంల భద్రతపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని, బీజేపీ ప్రభుత్వం పన్నెండేండ్లుగా ఓటు చోరీతో మోసం చేస్తోందని ఆరోపించారు. హుజూర్‌‌‌‌నగర్, నేరేడుచర్లలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిరుపేద కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీతో పాటు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, జిల్లా ఉన్నతాధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 గోదావరి జలాల వినియోగంలో రికార్డు..

ఎల్‌‌‌‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గినప్పటికీ, 2025-26లో తెలంగాణ రికార్డు స్థాయిలో 340 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకుందని మంత్రి ఉత్తమ్​వెల్లడించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ స్థాయిలో నీటిని వాడడం ఇదే మొదటిసారి అని అన్నారు. అయితే, తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించకుండా మేడిగడ్డకు మార్చడం వల్ల రాష్ట్రం సుమారు 165 టీఎంసీల నీటిని కోల్పోయిందని మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాంత ఎంపిక, డిజైన్, నిర్మాణం అన్నీ బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని, ఆనాటి లోపభూయిష్ట నిర్ణయాల వల్లే నేడు ఈ సమస్యలు తలెత్తాయని విమర్శించారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల జరిగిన నష్టాన్ని సరిదిద్దుతూనే కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ప్రతి నీటి చుక్కను వినియోగించుకుంటున్నామని స్పష్టం చేశారు.