
- హెల్త్ కార్డులకూ అప్లికేషన్లు.. అదే నెలలో లబ్ధిదారుల ఎంపిక
- పార్టీలు, ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాల సేకరణ
- ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న తీరుపై స్టడీ
- ఈ నెల 21న మరోసారి సబ్ కమిటీ భేటీ
- రేషన్, హెల్త్ కార్డులకు గైడ్‌లైన్స్ పూర్తి
- ఈ వానాకాలం పంట నుంచే సన్న వడ్లకు బోనస్
- జనవరి నుంచి రేషన్‌పై సన్నబియ్యం పంపిణీ
- వివరాలు వెల్లడించిన సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, వెలుగు: వచ్చే నెలలోనే కొత్త రేషన్ కార్డులు, హెల్త్‌కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. అర్హులైన ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డులు, కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రత్యేకంగా అప్లికేషన్లు సేకరించి, లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అర్హులైనవారందరికీ స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా విధివిధానాలు రూపొందించేందుకు సివిల్ సప్లయ్స్మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం కేబినెట్సబ్కమిటీ భేటీ అయింది. ఇప్పటికే సబ్ కమిటీ రాజకీయ పార్టీలకు లెటర్లు రాసి అభిప్రాయాలను చెప్పాలని కోరింది. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర 15 మంది ప్రజాప్రతినిధులు కమిటీకి లిఖిత పూర్వకంగా అభిప్రాయాలను పంపించారు.
ఇతర రాష్ట్రాల్లో రేషన్‌కార్డుల కోసం అమలు చేస్తున్న విధానాలు, ప్రజాప్రతినిధులు లిఖిత పూర్వకంగా ఇచ్చిన అభిప్రాయాలపై సోమవారం జరిగిన కేబినెట్ సబ్‌కమిటీ భేటీలో ఓవరాల్‌గా చర్చ జరిగింది. ఈ నెల 21న మరోసారి సబ్ కమిటీ భేటీ అయి స్పష్టమైన విధివిధానాలపై నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తి చేసుకుని అక్టోబర్ నెలలో రేషన్‌కార్డుల అప్లికేషన్లు స్వీకరించడంతోపాటు స్మార్ట్‌కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్సబ్కమిటీ భేటీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, సివిల్ సప్లయ్స్ కమిషనర్, హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, అధికారులు పాల్గొన్నారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు: ఉత్తమ్
అర్హులందరికీ వేగవంతంగా రేషన్‌కార్డులు ఇవ్వబోతున్నామని సివిల్ సప్లయ్స్మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కేబినెట్సబ్ కమిటీ అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్ నెలలో అప్లికేషన్ తీసుకుని, అర్హులను ఎంపిక చేసి, రేషన్ కార్డులు జారీచేస్తామని ప్రకటించారు. ‘‘రేషన్ కార్డుల విధివిధానాల కోసమే భేటీ జరిగింది. మరోసారి భేటీ అయి విధివిధానాలపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తాం. పూర్తి ప్రక్రియ ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తాం. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు లెటర్రాశాం. ఇప్పుడున్న పద్ధతితోపాటు కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టాలనే దానిపై ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా కోరాం. చేవెళ్ల , హైదరాబాద్, పెద్దపల్లి ఎంపీలు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఎల్బీనగర్, మల్కాజ్గిరి, ఆర్మూర్, ఖానాపూర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కౌన్సిల్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్లు అభిప్రాయాలు తెలిపారు. ఎంఐఎం పార్టీ అఫీషియల్‌గా రిప్లయ్ ఇచ్చింది. ఈ నెల 19లోగా అభిప్రాయాలు చెప్పాలని మరోమారు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాం” అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు అందించే రిప్రజంటేషన్లను కమిటీలో పొందుపరుస్తామని తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో ఇచ్చింది కేవలం 49,476 కార్డులే..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లలో ఇచ్చింది కేవలం 49,476 రేషన్‌కార్డులు మాత్రమేనని ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. అది కూడా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లోనే ఇచ్చారని చెప్పారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. 2 కోట్ల 84 లక్షల70 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఉన్న రేషన్ కార్డుల్లో సెంట్రల్ గవర్నమెంట్కింద 54.45 లక్షల కార్డులు ఉండగా.. 1.91 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్య ఇస్తుండగా ఇందులో 5 కేజీల చొప్పున కేంద్రం.. కిలో చొప్పున రాష్ట్రం భరిస్తుంది. అంతే కాకుండా మరో 35.51 లక్షల కార్డులు రాష్ట్ర ప్రభుత్వం కింద ఉండగా.. 93 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు.
వీరికి 6 కిలోల చొప్పున పూర్తిస్థాయిలో రాష్ట్రం ప్రభుత్వం రేషన్ అందిస్తున్నది” అని ఉత్తమ్ వివరించారు. అలాగే, అంత్యోదయ స్కీమ్కింద 5.66 లక్షల కార్డులు ఉండగా, వీరికి కేంద్రం నుంచి నెలకు 35 కిలోల బియ్యం అందిస్తున్నట్టు చెప్పారు. వీటికి అదనంగా సెంట్రల్స్కీమ్హెచ్ఐవీ పాజిటివ్తదితర మరో 5,416 కార్డులు ఉన్నాయని, పెన్షన్ రాని లబ్ధిదారులకు నెలకు 10 కిలోల బియ్యం అందిస్తారని వివరించారు.
సన్న వడ్లకు రూ.500 బోనస్
రాష్ట్రంలోని రైతులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుభవార్త చెప్పారు. ఈ వానాకాలం సీజన్ నుంచే సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నట్టు ప్రకటించారు. జనవరి నుంచే రేషన్‌లో సన్నబియ్యం అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవాప్తంగా ఉన్న రేషన్ లబ్ధిదారులందరికీ సన్న బియ్యం అందిస్తామని తెలిపారు. గతంలో ఇచ్చిన బియ్యం లబ్ధిదారులు తినకపోవడంతో మిస్ యూజ్ అయ్యాయని అన్నారు. అందుకే సన్నబియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
రేషన్‌కార్డుల జారీకి విస్తృత అధ్యయనం
‘‘గతంలో ఏ విధానంలో రేషన్ కార్డులు ఇచ్చారు? తాము ఎలా ఇవ్వాలి? అనే దానిపై విస్తృత అధ్యయం చేస్తున్నాం” అని ఉత్తమ్ తెలిపారు. ‘‘గతంలో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, అర్బన్‌లో రూ. 2 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. వ్యవసాయ భూమి పొలం అయితే 3.5 లక్షల ఎకరాలు, చెలక అయితే ఏడున్నర ఎకరాలు ఉండాలని రూల్స్ఉన్నయ్. పక్క రాష్ట్రం ఏపీలో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ లబ్ధిదారులకు 1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 1.44 లక్షల ఆదాయ పరిమితి ఉంది.
కర్ణాటకలో 1.20 లక్షల కంటే తక్కువ, తమిళనాడులో లక్ష కంటే తక్కువ, గుజరాత్లో 1.20 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండాలనే నిబంధనలు అమలవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న రూల్స్‌ను పరిశీలించి కొత్త రేషన్ కార్డుల నిబంధనలు రూపొందిస్తాం’ అని ఉత్తమ్పేర్కొన్నారు. దీనిపై తదుపరి కేబినెట్ భేటీలో ఓ క్లారిటీ వస్తుందని వెల్లడించారు.