హైదరాబాద్ సిటీ, వెలుగు: రహదారి సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించి పరిష్కరించేందుకు నగర డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి బస్తీ బాట పాదయాత్రను చేపట్టారు. బుధవారం తార్నాక పరిసరాల్లో ఆమె పర్యటించారు. రోడ్లు, డ్రైనేజీ లైన్లు, గుంతలు, నీరు నిలిచే ప్రాంతాలు, ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించే స్థానాలను పరిశీలించారు. కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలు, సూచనలు తీసుకోవడంతో పాటు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ... ప్రజలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న రహదారి సమస్యలు ఇకపై వాయిదా పడకుండా తక్షణమే పరిష్కారం చూపిస్తామన్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు వెంటనే మరమ్మతులు చేపడుతారన్నారు. పాదయాత్రలో తమ ప్రాంత సమస్యలను ప్రజలు డిప్యూటీ మేయర్ కు వివరించారు.
ప్రజలు ఇచ్చిన సూచనలను భవిష్యత్‌లో అభివృద్ధి ప్రణాళికలో భాగం చేస్తామని డిప్యూటీ మేయర్ హామీ ఇచ్చారు. ఈ యాత్రలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి పాల్గొన్నారు.
