వనపర్తి/కొల్లాపూర్, వెలుగు: కృష్ణా జలాలపై స్పష్టత కోసమే ప్రాజెక్టుల బాట పట్టామని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు బాటలో భాగంగా మంగళవారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి వనపర్తి జిల్లాలోని జూరాల ప్రాజెక్డు ఎడమ కాలువ, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని పీఆర్ఎల్ఐ అంజనగిరి రిజర్వాయర్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురి చేసేందుకే పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి చేపట్టాలనే వాదనను కాంగ్రెస్ తెరపైకి తెచ్చిందన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లు ఖర్చు చేశామని, ప్రాజెక్ట్ ఆగిపోవడానికి ఏపీకి మేలు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందని విమర్శించారు.
సిద్ధేశ్వరం వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును శ్రీశైలం వద్ద కట్టారని, గ్రావిటీ ద్వారా నీళ్లు వాడుకోలేని విధంగా ప్రాజెక్టులు నిర్మించారన్నారు. బచావత్ ట్రిబ్యునల్ పాలమూరు వెనుకబాటును చూసి 20 టీఎంసీలు కేటాయించిందని, శ్రీశైలం ఇరిగేషన్‌కు పనికిరాదని అప్పుడే చెప్పారని గుర్తు చేశారు. జూరాల నుంచి ఇప్పటికే 6 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయని, మరిన్ని ఎత్తిపోతలు నిర్మించడం అసాధ్యమని చెప్పారు.
అందుకే జూరాల నుంచి శ్రీశైలానికి మారామని తెలిపారు. ఇది సాంకేతికంగా సరైన నిర్ణయమని చెప్పారు. మిగిలిన పనులు చేసి నీళ్లు ఇవ్వకుండా ప్రాజెక్ట్ తప్పు అని మాట్లాడటం సరైంది కాదన్నారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ క్రాప్ హాలిడే ప్రకటించిన జూరాల నుంచి 70 టీఎంసీలు తీసుకెళ్లడం అన్యాయమన్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
